ఇది సైద్ధాంతిక పోరాటం !

Apr 13,2024 07:54 #ideological fight!

రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, బహుళత్వ పరిరక్షణే లక్ష్యం
తమిళనాడు ఎన్నికల సభలో రాహుల్‌ గాంధీ
తిరునల్వేలి : భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యం, బహుళత్వాన్ని పరిరక్షించేందుకు ఇండియా బ్లాక్‌, బిజెపి మధ్య జరిగే సైద్ధాంతిక పోరాటమే ఈసారి లోక్‌సభ ఎన్నికలని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ పోరులో ఇండియా బ్లాక్‌ విజయం సాధిస్తుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. తమిళనాడులోని పాళయంకుట్టిలో శుక్రవారం నిర్వహించిన మొదటి ఎన్నికల సభలో రాహుల్‌ ప్రసంగించారు. స్వేచ్ఛ, సమానత్వం కోసం ఇండియా బ్లాక్‌ పోరాడుతోందని, బిజెపి కూటమి, ప్రధాని మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం మాత్రం ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్ధాంతాలకు మద్దతునిస్తోందన్నారు. వివిధ భాషలు, సంస్కృతులతో వైవిధ్యభరితమైన దేశంగా భారత్‌ను ఇండియా బ్లాక్‌ భావిస్తుంటే, బిజెపి మాత్రం ఒకే దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి, ఒకే నేత అన్న నినాదాన్ని ప్రచారం చేస్తోందన్నారు. ఇండియా బ్లాక్‌కు సంబంధించి అందరూ సమానమేనన్నారు. దానికోసమే సైద్ధాంతిక పోరాటం కొనసాగుతోందన్నారు.
ఈ తరహాలోనే, తమిళ భాషపై, తమిళ సంస్కృతిపై, వారి ఆచారాలు, సాంప్రదాయాలపై నిరంతరంగా దాడులు జరుగుతున్నాయన్నారు. తమిళం, బెంగాలీ, ఇలా అన్ని భారతీయ భాషలు కలిస్తేనే మన భారతదేశమన్నారు. మన ఆచారాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, చరిత్ర అన్నీ పవిత్రమైనవేనన్నారు.
కేవలం 21మంది భారతీయులకు 16లక్షల కోట్ల రుణాలు ఇచ్చారని, వాటన్నింటినీ ప్రధాని మోడీ సంతోషంగా రద్దు చేసేశారని రాహుల్‌ విమర్శించారు. దేశ రైతాంగానికి ఇచ్చిన పంట రుణాలను మాఫీ చేయడానికి తిరస్కరిస్తున్నారని విమర్శించారు. రైతులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన జరుపుతున్నారని, పంట నష్టాలను భరించలేక ప్రతి రోజూ 30మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని రాహుల్‌ పేర్కొన్నారు. అయినా మోడీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. కేవలం ఇద్దరు ముగ్గురు బడా పారిశ్రామికవేత్తలకు మాత్రమే ప్రభుత్వ కాంట్రాక్టులు, ఇతర ప్రయోజనాలను కట్టబెడుతున్నారని విమర్శించారు.
ఇడి, సిబిఐ, ఐటిలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తూ రాజకీయ ప్రత్యర్ధులను లక్ష్యంగా చేసుకుంటున్నారని రాహుల్‌ విమర్శించారు. కేవలం ఎన్నికలు రెండు మాసాల్లో జరగనుండగా కాంగ్రెస్‌ బ్యాంక్‌ ఖాతాలను స్తంభింపచేశారన్నారు. భారత రాజ్యాంగాన్నే మార్చేస్తామని బిజెపి ఎంపీలు బహిరంగంగానే బెదిరిస్తున్నారన్నారు. ఒకప్పుడు ప్రజాస్వామ్యానికి దిక్సూచీలా యావత్‌ ప్రపంచం కీర్తించిన భారతదేశంలో ఇప్పుడు ప్రజాస్వామ్యం ఉనికికే ప్రమాదం ఏర్పడిందన్నారు. కేంద్రం నుండి వరద సాయం కోసం తమిళనాడు పదే పదే అభ్యర్ధించినా కేంద్రం తిరస్కరిస్తూ వస్తోందన్నారు.
కాంగ్రెస్‌ మేనిఫెస్టోపై బిజెపి చేసిన విమర్శలను రాహుల్‌ తీవ్రంగా నిరసించారు. తమ ఎన్నికల ప్రణాళికలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వస్తే పూర్తిగా అమలు చేసేందుకు కట్టుబడి వున్నామన్నారు. తూత్తుకుడి ఎంపి, నియోజకవర్గ అభ్యర్ధి కనిమొళి మాట్లాడుతూ, అందరినీ కలుపుకునిపోయే, ప్రజాస్వామ్యం, సమానత్వం కలిగిన సమాజాన్ని డిఎంకె విశ్వసిస్తుందని, కాంగ్రెస్‌ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా దాన్నే తాము చూడగలిగామన్నారు. ఎన్నికల ప్రచార గీతాలు కలిగిన సిడిని రాహుల్‌ ఆవిష్కరించగా, కనిమొళి దాన్ని అందుకున్నారు.

➡️