ఆ ఆరు రాష్ట్రాలు కష్టమే

Apr 21,2024 08:42 #2024 election, #PM Modi
  • కర్ణాటక, జార్ఖండ్‌కు కాంగ్రెస్‌కు పట్టు
  • పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలో ప్రాంతీయ పార్టీల సర్కార్లు
  • మహారాష్ట్ర, బీహార్‌లో అధికారమున్నా.. బలహీనంగా బిజెపి
  • 2019తో పోలిస్తే మారిన రాజకీయ పరిస్థితులు

న్యూఢిల్లీ : దేశంలో ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో పలు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా, కేంద్రంలో అధికారంలోకి రావటం కోసం రెండు ప్రధాన జాతీయ పార్టీలైన కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఇండియా ఫోరం, అధికార బిజెపి నాయకత్వంలోని ఎన్‌డిఎ పోటీ పడుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏకంగా లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డిఎకు ‘అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌’ అంటూ నినదాలు హోరెత్తిస్తున్నారు. బిజెపికే 370కి పైగా సీట్లను వస్తాయంటూ గొప్పలు వల్లె వేస్తున్నారు. అయితే, మోడీ, బిజెపి శ్రేణులు అనుకుంటున్నట్టుగా క్షేత్రస్థాయిలో పరిస్థితులు లేవని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ‘ఇండియా’ ఫోరం ఏర్పాటుతో అనేక రాష్ట్రాల్లో కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు బలపడ్డాయని వారంటున్నారు. పదేళ్ల పాలనలో బిజెపి ప్రజలకు చేకూర్చిన ప్రయోజనాలేమీ లేవని, ధరాఘాతం, నిరుద్యోగం వంటి సమస్యల నేపథ్యంలో మోడీ సర్కార్‌పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, అందువల్ల మోడీ నినాదం పగటి పూట కలగా మిగిలిపోతుందని వారంటున్నారు. ప్రీపోల్‌ సర్వే ఫలితాలకు భిన్నంగా.. 2004 లోక్‌సభ ఎన్నికల నాటి పరిస్థితులు రిపీట్‌ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు.
కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, కేంద్రంలో కొత్త ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోవటంతో 2014 ఎన్నికల్లో మోడీ నేతృత్వంలోని బిజెపి గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ సీట్లను సొంతం చేసుకొని అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌పై తీవ్ర వ్యతిరేకత ఉన్న సమయం లోనే బిజెపి 2014 ఎన్నికల్లో 282 సీట్లు, 2019 ఎన్నికల్లో 303 స్థానాల్లో విజయం సాధించిందనీ, ఈ సారి ఎన్నికల్లో మాత్రం మోడీ సర్కారుపై తీవ్ర వ్యతిరేకత ఉన్నందున ‘చార్‌ సౌ పార్‌’ అనేది కాషాయపార్టీకి సాధ్యం కాదని అంటున్నారు.

ఆరు రాష్ట్రాల్లో 193 లోక్‌సభ స్థానాలు
మోడీ చేస్తున్న చార్‌ సౌ పార్‌ నినాదానికి మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, కర్నాటక, జార్ఖండ్‌, ఒడిషా రాష్ట్రాలు కొరకరాని కొయ్యగా మారాయని చెప్తున్నారు. ఈ ఆరు రాష్ట్రాల్లో మొత్తం 193 ఎంపీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతిపక్ష పార్టీలు సైతం చాలా బలంగా ఉన్నాయి. మహారాష్ట్ర, బీహార్‌ రాష్ట్రాల్లో ఎన్‌డిఎ కూటములే అధికారంలో ఉన్నా.. బిజెపి వ్యక్తి మాత్రం ముఖ్యమంత్రి స్థానంలో లేరు. ఈ రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో సహా అక్కడి స్థానిక పార్టీల నుంచి బిజెపికి తీవ్ర పోటీ ఎదురు కానున్నదని రాజకీయ, ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌ తృణమూల్‌ కాంగ్రెస్‌, ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ నేతృత్వంలోని బిజెడి వంటి ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో రెండు ప్రాంతీయ పార్టీలకు బలం బాగానే ఉన్నది. కర్నాటకలో కాంగ్రెస్‌, జార్ఖండ్‌లో జెఎంఎం-కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వాలున్నాయి. ఇక్కడా పోటీ తీవ్రంగానే ఉంటుంది.

గతంలో బిజెపిని గట్టెక్కింది ఆ 12 రాష్ట్రాలే
2019 లోక్‌సభ ఎన్నికల్లో ‘పుల్వామా’ ఉగ్రదాడులు, బాలాకోట్‌ సర్జికల్‌ స్ట్రైక్‌ అంశాలు బిజెపికి అనుకూలంగా మారాయి. ఈ అంశాలు ప్రజల్లో తీవ్ర భావోద్వేగాన్ని రగిల్చాయి. 2014 ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్‌ శాతాన్ని పెంచుకున్న బిజెపి మరో 21 సీట్లకు ఎగబాకి 303కు చేరింది. బీహార్‌, మధ్యప్రదేశ్‌, కర్నాటక, రాజస్థాన్‌, గుజరాత్‌, మహారాష్ట్ర, యూపీ, ఛత్తీస్‌గఢ్‌, హర్యానా, అసోం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ వంటి 12 రాష్ట్రాలలో ఉన్న మొత్తం 320 సీట్లలో దాదాపు 278 సీట్లను గెలుచుక్నుది. అయితే, మిగిలిన 25 సీట్లను ఇతర రాష్ట్రాలలో అతి కష్టం మీద గెలిచింది. ఈ సారి ఎన్నికల్లో మాత్రం ఈ 12 రాష్ట్రాలలోనూ బిజెపికి వ్యతిరేకంగా పరిస్థితులు ఏర్పడ్డాయనీ, ఇక్కడ నుంచి ఎంపీ సీట్లు గెలవటం కాషాయపార్టీకి అంత సులువేం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

అన్ని తరగతుల్లోనూ వ్యతిరేకత
2019 ఎన్నికల్లో 224 స్థానాల్లో బిజెపి 50 శాతానికి పైగా ఓట్లను సాధించింది. ఈ 224 సీట్లలో ఎక్కువ భాగం కూడా బిజెపికి బలం ఉన్న పై 12 రాష్ట్రాల నుంచి వచ్చాయి. కానీ ఇప్పుడు ‘ఇండియా’ ఫోరం ఏర్పడింది. పుల్వామా లాంటి రెచ్చగొట్టే భావోద్వేగ అంశాలు ఈ సారి లేవు.
పైగా బిజెపి మీద ప్రజలు, యువత, మహిళ, మైనారిటీలు, దళితులు, కార్మికులు, రైతులకు తీవ్ర కోపమున్నదనీ, కాషాయ పార్టీ ప్రభుత్వంపై ఈ వ్యతిరేకత కారణంగా మోడీ ‘చార్‌ సౌ పార్‌’ లక్ష్యానికి గండి పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన ఆ 224 స్థానాలనే ఈ సారి కూడా బిజెపి గెలిచిందనుకున్నా.. తీవ్ర ప్రజా వ్యతిరేకత ఉన్న, క్షేత్రస్థాయిలో బలం లేని మిగతా రాష్ట్రాల నుంచి ఆ పార్టీ 370కి కావాల్సిన మిగిలిన సీట్లను సాధించడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు.

‘దక్షిణాది’లో అందని ద్రాక్షే
ముందుగా చెప్పిన ఆరు రాష్ట్రాల్లోని నాలుగు రాష్ట్రాలు కర్నాటక, బీహార్‌, మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కొత్త రాజకీయ సవాళ్లు ఏర్పడ్డాయి. మిగిలిన రెండు రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్‌, ఒడిశాలో ఇప్పటికే మోడీకి వివిధ స్థాయిలలో ప్రతిఘటనను అందించాయని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. దక్షిణాదిన ఉన్న తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కేరళలోని దాదాపు 100 సీట్లు బిజెపికి అందని ద్రాక్ష వంటివేనని చెప్తున్నారు. కనీసం 2019లో వచ్చిన 303 సీట్లనైనా దాటడానికి ముందుగా పేర్కొన్న ఆరు రాష్ట్రాల నుంచి మరో 100 లేదా అంతకంటే ఎక్కువ స్థానాలను బిజెపి గెలవాల్సిన అవసరం ఉంటుంది. ఆ ఎన్నికల్లో బిజెపి 102 సీట్లను ఈ ఆరు రాష్ట్రాల నుండి కైవసం చేసుకున్న కారణంగానే 303 కు చేరుకోగలిగింది.
మహారాష్ట్ర, బీహార్‌లో..బిజెపికి బలమైన మిత్రపక్షాలుగా ఉన్న పార్టీలు చాలా బలహీనంగా ఉన్నాయి. శివసేన విడిపోయింది. రాజకీయ స్థిరత్వం లేని నితీశ్‌ నేతృత్వంలోని జెడియు.. బీహార్‌లో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. నితీశ్‌ను బిజెపి మళ్లీ అక్కున చేర్చుకోవటం కూడా పెద్ద మైనస్‌గా మారనుందని విశ్లేషకులు చెప్తున్నారు. కర్నాటక, జార్ఖండ్‌లలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌.. దాని మిత్రపక్షాలతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్నదని అంటున్నారు.

➡️