GN Saibaba: సామాజిక అభివృద్ధిని కోరుకోవడం అతివాదమా ? : జిఎన్‌ సాయిబాబా

Mar 25,2024 18:16 #GN Saibaba, #Humanity, #social progress

న్యూఢిల్లీ : మానవత్వాన్ని, సామాజిక అభివృద్ధిని కోరుకోవడం అతివాదమా అని మానవహక్కుల కార్యకర్త, ఢిల్లీ యూనివర్శిటీ మాజీ ప్రొఫెసర్‌ జి.ఎన్‌. సాయిబాబా ప్రశ్నించారు. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే అరోపణలపై 2014లో అరెస్టయిన సాయిబాబా ఏడేళ్ల జైలుశిక్ష తర్వాత మార్చి 7న నాగపూర్‌ సెంట్రల్‌ జైలు నుండి నిర్దోషిగా విడుదలైన సంగతి తెలిసిందే. గత దశాబద్ద కాలంగా ఆయన న్యాయపోరాటం సాగించారు. జైలు నుండి విడుదలైన తర్వాత సోమవారం ఆయన మొదటిసారిగా మీడియాతో మాట్లాడారు. జైలులో పరిస్థితులు, ఇతర అంశాల గురించి వివరించారు. ఇంతకాలం జైలు శిక్ష అనుభవిస్తానని ఊహించలేదని అన్నారు. నేరారోపణకు ముందు మొత్తం మూడేళ్ల వ్యవధిలో 17 నెలలు, నేరారోపణ అనంతరం సుమారు ఏడేళ్లు. అంటే గత పదేళ్లలో ఎనిమిదిన్నరేళ్లు జైలులోనే ఉన్నట్లు తెలిపారు. మొదటి విడుదల ఆర్డర్‌ వచ్చిన తర్వాత సుమారు ఒకటిన్నరేళ్ల పాటు జైలు జీవితం గడిపానని, విడుదల తర్వాత ఆర్డర్‌ పొందాల్సి వచ్చిందని .. బహుశా భారత న్యాయ చరిత్రలో ఇలా ఎప్పుడూ జరగలేదని అన్నారు. అయితే నేరం చేయకుండా సుదీర్ఘకాలం జైలులో గడపడం అదీ సుమారు ఏడేళ్లు అనేది ఇక్కడ ప్రశ్న. దేశంలో ఇలా ఎందుకు జరుగుతోందనేది అతిపెద్ద ప్రశ్న. ప్రస్తుతం అరోగ్య పరిస్థితులపై మాట్లాడుతూ.. జైలుకు ముందు తాను వీల్‌ ఛెయిర్‌లో ఉన్నాననే భావన లేకుండా స్వేచ్ఛగా జీవితం గడిచేది. జైలు తర్వాత జీవితం మారిపోయింది. అరెస్ట్‌ చేసే సమయంలో పోలీసులు దురుసు ప్రవర్తన కారణంగా మెదడుతో భుజాన్ని కలిపే నాడీ వ్యవస్థ దెబ్బతినడంతో భుజంపై తీవ్ర ప్రభావం పడింది. ఇప్పుడు ఎడమ చేతితో పుస్తకాన్ని కూడా పట్టుకోలేని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. స్లీప్‌ అప్నియా ప్రారంభమైందని, గుండె ఎడమభాగం కేవలం 55 శాతం సామర్థ్యంతోనే పనిచేస్తుందని చెప్పారు. ప్యాంక్రియాటైటిస్‌, ఇలా పలు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.

➡️