నీట్‌ రీ ఎగ్జామ్‌లో ఎవరికీ దక్కని టాప్‌ ర్యాంక్‌

Jul 2,2024 07:57 #NEET exam results, #re exam
  •  61కు తగ్గిన ఆల్‌ ఇండియా ర్యాంకర్ల సంఖ్య

న్యూఢిల్లీ : గత నెల చివరిలో జరిగిన నీట్‌-యుజి రీ ఎగ్జామ్‌లో ఫలితాలలను తాజాగా వెల్లడించగా, ఇందులో పాల్గొన్న ఎవ్వరికీ టాప్‌ ర్యాంక్‌ దక్కలేదు. దీంతో మే 5న జరిగిన నీట్‌-యుజి పరీక్షల్లో అక్రమాలు జరిగాయని నిర్థారణ అయిందని విమర్శకులు, నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తాజా ఫలితాల్లో ఎవ్వరికీ టాప్‌ ర్యాంక్‌ లభించకపోవడంతో ఆల్‌ ఇండియా ర్యాంకర్ల సంఖ్య 61కు తగ్గింది. మే 5న నిర్వహించిన నీట్‌ యుజి పరీక్ష పెద్ద స్కామ్‌ అని దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సంగతి తెలిసిందే. దీనిని రద్దు చేయాలని కూడా అభ్యర్థులు, ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఈ నీట్‌ స్కామ్‌పై విచారణ ప్రారంభించిన సిబిఐ ఇప్పటికే ఆరుగుర్ని అరెస్టు చేసింది. నీట్‌-యుజి పేవర్‌ లీక్‌ అయిందని కూడా ప్రాథమిక విచారణలో గుర్తించింది. ఇలాంటి నేపథ్యంలో జూన్‌ 27న ఉత్తమ ర్యాంక్‌లు సాధించిన 1,563 మంది అభ్యర్థులకు మరోసారి నీట్‌-యుజి పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే వీరిలో 813 మంది మాత్రమే రెండోసారి పరీక్షకు హాజరయ్యారు. ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌, హర్యానా, మేఘాలయాలోని ఏడు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది. ఈ ఫలితాలను ఆదివారం రాత్రి వెల్లడించారు. ఈ ఫలితాల్లో ఎవ్వరికి టాప్‌ ర్యాంక్‌ లభించలేదు. జూన్‌ 4న ప్రకటించిన గత నీట్‌ ఫలితాల్లో 720కు 720 మార్కులు సాధించిన అభ్యర్థులు ఎవ్వరూ కూడా ఈ సారి అదే మార్కులు సాధించలేకపోయారు. ముఖ్యంగా హర్యానాలో ఒక కేంద్రానికి చెందిన ఆరుగురు గత ఫలితాల్లో 720కు 720 మార్కులు సాధించారు. ఈసారి వీరిలో ఒక్కరికీ ఆ మార్కులు రాలేదు. తాజా ఫలితాలతో ఆల్‌ ఇండియా ర్యాంకర్ల సంఖ్య 61కు తగ్గింది. మే 5న జరిగిన నీట్‌ యుజి ఫలితాలను జూన్‌ 4న వెల్లడించగా, మొత్తం 67 మంది ఆల్‌ ఇండియా ర్యాంక్‌ను సాధించిన సంగతి తెలిసిందే.

➡️