పారదర్శకత, నిష్పాక్షికతలను పరిరక్షించాలి

Apr 1,2024 23:43 #supreem court
  •  అన్ని సమస్యలకు సుప్రీంకోర్టు పరిష్కారం కాదు
  • రైతు మృతిపై కమిటీ ఏర్పాటులో జోక్యం చేసుకోవడానికి సుప్రీం తిరస్కృతి

న్యూఢిల్లీ : పంజాబ్‌-హర్యానా సరిహద్దుల్లో రైతుల ఆందోళన సందర్భంగా 22 ఏళ్ల యువకుడు మరణించిన సంఘటనపై దర్యాప్తు చేసేందుకు రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ జయశ్రీ థాకూర్‌ నేతృత్వంలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ పంజాబ్‌, హర్యానా హైకోర్టు జారీ చేసిన ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు సుప్రీం కోర్టు సోమవారం తిరస్కరించింది. రైతుల నిరసనలు, ఆందోళనలకు హర్యానా పోలీసుల నుండి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. గత ఫిబ్రవరిలో ఢిల్లీకి ప్రదర్శనగా వెళ్లాలనుకున్న రైతులను సరిహద్దుల్లో పోలీసులు ఆపివేశారు. ఈ సందర్భంగా హర్యానా పోలీసులు రైతులపై జులుం ప్రదర్శించడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో మరణించిన రైతు సుఖ్‌వీర్‌ సింగ్‌ సోదరికి ఉద్యోగాన్ని ఇచ్చి, ఆ కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారాన్ని పంజాబ్‌ ముఖ్యమంత్రి మాన్‌ ప్రకటించారు.
హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్ర పోలీసుల నైతికత దెబ్బతింటుందని హర్యానా ప్రభుత్వం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా పేర్కొన్నారు. పోలీసుల దర్యాప్తును మీరెందుకు విశ్వసించడం లేదని ప్రశ్నించారు. రైతు సుఖ్‌వీర్‌ సింగ్‌ మరణంపై సక్రమంగా దర్యాప్తు చేయగలిగే సామర్ధ్యం హర్యానా పోలీసులకు వుందని మెహతా చెప్పారు. ఈరోజు పోలీసులను విశ్వసించలేకపోతే, తరువాత వారు అవసరమైనా కాల్పులు జరిపేందుకు వెనుకాడవచ్చని మెహతా వాదించారు. రైతుల ఆందోళనలను ఎదుర్కొనే సమయంలో 67మంది పోలీసు అధికారులు గాయపడ్డారని ఆయన గుర్తు చేశారు.
ఈ సంఘటన కచ్చితంగా హత్యేనని జస్టిస్‌ కాంత్‌ వ్యాఖ్యానించారు. రైతు హత్య తర్వాత కనీసం వారం రోజుల వరకు పోలీసులు కనీసం ఎఫ్‌ఐఆర్‌ కూడా దాఖలు చేయలేదని బెంచ్‌ గుర్తు చేసింది. మాజీ న్యాయమూర్తిని కమిటీలో చేర్చడం వల్ల పారదర్శకత పెరుగుతుందని, నిష్పాక్షికత నెలకొంటుందని, ఈ వ్యవస్థ పట్ల ప్రజల్లో విశ్వాసం బలోపేతమవుతుందని జస్టిస్‌ కాంత్‌ పేర్కొన్నారు. అన్ని సమస్యల పరిష్కారానికి సుప్రీం కోర్టు సర్వరోగ నివారణిగా మారాలని తాము కోరుకోవడం లేదన్నారు. హైకోర్టు కూడా రాజ్యాంగ కోర్టేనని చెప్పారు. మెహతా వ్యక్తం, చేసిన భయాందోళనల్లో అర్థం లేదన్నారు.

➡️