ఢిల్లీలో ‘ఉబర్‌ బస్సు’లకు అనుమతి

May 21,2024 23:05 #'Uber buses', #allowed, #Delhi

– ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌ ఆక్షేపణ
– విరమించుకోవాలని కేజ్రీవాల్‌కు లేఖ
న్యూఢిల్లీ : ఢిల్లీలో బస్సులు నడపడానికి ప్రముఖ కార్పొరేట్‌ సంస్థ ఉబర్‌కు అనుమతి ఇచ్చినట్లుగా వస్తున్న వార్తలపై అఖిల భారత రోడ్డు రవాణా కార్మికుల సమాఖ్య (ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌) అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఒక లేఖ రాసింది. ఢిల్లీలో బస్సులు నడపడానికి ఉబర్‌కు అనుమతి ఇవ్వడం ఢిల్లీ ప్రజలు, డ్రైవర్లు, ఢిల్లీ రవాణా కార్పొరేషన్‌ (డిటిసి) ప్రయోజనాలకు హానికరమని పేర్కొంది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సమయంలో ఉబర్‌కు అనుమతి ఇవ్వడం ఎన్నికల ప్రవర్తనా నియామళిని ఉల్లంఘించడమేని తెలిపింది. అలాగే మోటార్‌ వాహనాల సవరణల చట్టం 2019ను తాము మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నట్లు ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌ పునరుద్ఘాటించింది. ఈ చట్టానికి వ్యతిరేకంగా సమ్మె చేశామని గుర్తు చేసింది. దేశవ్యాప్తంగా తీవ్ర ప్రతిఘటన వెల్లువెత్తినా కేంద్రంలోని మోడీ సర్కార్‌ 2019 జులైలో ఈ చట్టాన్ని తీసుకొచ్చిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు కేంద్ర ప్రభుత్వ వినాశకర చర్యలపై పోరాడుతూ మరోవైపు అదే ప్రభుత్వం తీసుకొచ్చిన వినాశకర చట్టాన్ని సాకుగా చేసుకొని ఉబర్‌కు ఇలాంటి అనుమతులు ఇవ్వడం సమంజసం కాదని ఆక్షేపించింది. కేంద్రం తీసుకొచ్చిన మోటారు వాహనాల సవరణ చట్టంలోని క్లాజ్‌ 36 ఆఫ్‌ సెక్షన్‌ 93 ప్రకారం ప్రయివేటు అగ్రిగేటర్లకు ఇలాంటి లైసెన్స్‌లు ఇచ్చేలా వెసులుబాటు కల్పించిన సంగతి విదితమే. మొత్తం రోడ్డు రవాణా రంగాన్ని భారీ కార్పోరేట్‌ కంపెనీలకు కట్టబెట్టే లక్ష్యంతోనే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఈ క్లాజ్‌ చేర్చారని ఎఐఆర్‌టిడబ్ల్యుఎఫ్‌ విమర్శించింది. ఉబర్‌, ఓలా వంటి అగ్రిగేటర్లు అటు డ్రైవర్లను ఇటు ప్రయాణికులను ఎలా మోసం చేస్తున్నాయో చూస్తున్నామని, ఆ సంస్థల వేధింపులకు వ్యతిరేకంగా డ్రైవర్లు సమ్మె చేపట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని పేర్కొంది. ఈ అంశాలన్నీ దృష్టిలో ఉంచుకొని తక్షణమే ఉబర్‌కు ఇచ్చిన అనుమతులను వెనక్కి తీసుకోవాలని కోరింది.

➡️