క్రిమినల్‌ చట్టాలపై యుజిసి ప్రచారం

Feb 21,2024 10:11 #Criminal Bill, #UGC
UGC campaign on criminal laws

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వానికి, ప్రత్యేకించి బిజెపి అనుకూల ప్రచారాలు నిర్వహించే ఒక ప్రచార కార్యాక్రమాల సంస్థగా యూనివర్శిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) మారిపోయిందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. మోడీ సర్కార్‌కు భజన చేసేలా ఇప్పటికే అనేక కార్యాక్రమాలు నిర్వహించిన యుజిసి తాజాగా కేంద్రానికి సంకటంగా మారిన కొత్త క్రిమినల్‌ చట్టాలపై ‘అపోహాలు’ తొలగించే బాధ్యతను కూడా భుజానికెత్తుకుంది. ప్రధానంగా ‘భారతీయ న్యాయ సంహిత’లో పొందు పర్చిన కఠిన శిక్షలపై దేశవ్యాప్తంగా రవాణా రంగ కార్మికులు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త క్రిమినల్‌ చట్టాలను విస్తృతంగా ప్రచారం చేయా లని, వాటిపై ప్రజల్లో ‘అపోహలను’ తొలగిం చాలని దేశవ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యా సంస్థ (హెచ్‌ఇఐ)లకు యుజిసి ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తి స్వేచ్ఛను హరిం చేవిగా, పోలీసు రాజ్యాన్ని స్థాపించేవిగా ఉన్నాయంటూ వస్తున్న అపోహలను తొలగించా లని నిర్దేశించింది. ఈ సందర్భంగా యుజిసి కార్యదర్శి మనీష్‌ జోషి మాట్లాడుతూ, భారతీయ న్యాయ సంహిత- 2023 గురించి ప్రచారం చేయాలని, ప్రత్యేక ప్రదర్శలు, కరపత్రాలు పంపిణీ చేయాలని విద్యా సంస్థలను కోరా మన్నారు. అలాగే న్యాయవాదులు, విద్యార్థుల కోసం ప్రత్యేక సెమినార్లు, చర్చలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. ఈ వివరాలను విద్యా సంస్థలు తమకు పంపితే వాటిని కేంద్ర హోంశాఖకు పంపిస్తామని విద్యాశాఖ తమను ఆదేశించినట్లు మనీష్‌ తెలిపారు. భారతీయ సాక్ష్యా సంహిత (బిఎస్‌ఎస్‌)-2023, భారతీయ నాగరిక్‌ సురక్ష సంహిత (బిఎన్‌ఎస్‌ఎస్‌)-2023, భారతీయ న్యాయ సంహిత (బిఎన్‌ఎస్‌)-2023 శీతాకాల సమా వేశాల సందర్భంగా పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోదించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం ముద్ర తరువాత అవి చట్టాలుగా రూపొందాయి. ఇండియన్‌ ఎవిడెన్స్‌ యాక్ట్‌ (ఐఇఎ) -1872, క్రిమినల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ (సిఆర్‌పిసి)-1973, ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ (ఐపిసి)ల స్థానంలో వీటిని తీసుకొచ్చిన సంగతి విదితమే.

➡️