ఢిల్లీలో నీటి యుద్ధం

Jun 16,2024 22:15 #Delhi, #Water war

– జల్‌బోర్డు కార్యాలయంపై బిజెపి దాడి
– కేంద్రం జోక్యం చేసుకోవాలి : ఆప్‌
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో
ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది. ఎగువన ఉన్న హర్యానా ఢిల్లీకి నీరు విడుదల చేయకపోవడంతో ఢిల్లీ వాసులు నీటి కష్టాలు పడుతున్నారు. చాలా ప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. బిజెపి హింసాత్మక ఆందోళనతో యుద్ధాన్ని తలపించే పరిణామాలు చోటుచేసుకున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, ప్రధాన నీటి పైప్‌లైన్లకు పోలీసులు రక్షణ కల్పించాలని ఢిల్లీ మంత్రి అతిషి కోరారు. నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని ఆరోపిస్తూ ఢిల్లీ జల్‌ బోర్డు కార్యాలయం వద్ద బిజెపి చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బిజెపి కార్యకర్తలు జల్‌ బోర్డు కార్యాలయాన్ని ధ్వంసం చేశారు.
చత్తార్‌పూర్‌ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ కార్యకర్తలు జల్‌ బోర్డు కార్యాలయం వద్ద నిరసనలకు దిగారు. ఈ ఘటనపై బిజెపి నేత రమేష్‌ బిధూరి స్పందించారు. ప్రజల ఆగ్రహం కట్టలు తెంచుకుంటే ఏమైనా చేయగలరని మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. ఇది ప్రజల, ప్రభుత్వ ఆస్తి అని, వీటిని ధ్వంసం చేయడం తగదని అన్నారు.
కేంద్రం జోక్యం చేసుకోవాలి
కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోకపోతే ఢిల్లీలో నీటి సంక్షోభ పరిస్థితి మెరుగుపడదని ఢిల్లీ మంత్రి అతిషి ఆదివారం పేర్కొన్నారు. హర్యానాలోని తమ ప్రభుత్వంతో బిజెపి చర్చించి ఢిల్లీ ఎక్కువ నీరు పొందేలా చూడాలని అన్నారు. ఢిల్లీలో నీటి ఎద్దడి తీవ్రమవుతుండటంతో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ప్రధాన పైప్‌లైన్లకు భద్రత కల్పించేందుకు పోలీస్‌ సిబ్బందిని నియమించాలని కోరుతూ ఆదివారం ఢిల్లీ పోలీస్‌ కమిషనర్‌ సంజరు అరోరాకు మంత్రి లేఖ రాశారు. సోనియా విహార్‌ నుండి దక్షిణ ఢిల్లీ ప్రధాన పైప్‌లైన్‌లో లీకేజీ ఏర్పడిందని అన్నారు. దక్షిణ ఢిల్లీ మొత్తం నీరు అందించే ఈ పైప్‌లైన్‌ లీకేజీ వెనుక కుట్ర ఉన్నట్లు ఆ లేఖలో పేర్కొన్నానని అన్నారు. అయితే ఇది ఆరోపణలు, ప్రత్యారోపణలకు, నీచరాజకీయాలకు సమయం కాదని అన్నారు. హర్యానాలోని తమ ప్రభుత్వంతో మాట్లాడి ఢిల్లీకి ఎక్కువ నీరు ఇప్పించాలని బిజెపిని అభ్యర్థిస్తున్నానని పేర్కొన్నారు. ఈ పరిస్థితిలో కేంద్రం జోక్యం చేసుకోకపోతే.. పరిస్థితి బాగుపడదని అన్నారు. తమ నీటి నిర్వహణ బృందం ఆరు గంటల పాటు శ్రమించి పైప్‌లైన్‌ లీకేజీని సరిచేసిందని, దీని అర్థం ఆరు గంటల పాటు నీటి సరఫరాను నిలిపివేయాల్సి వచ్చిందని చెప్పారు. దాంతో దక్షిణ ఢిల్లీలో 25 శాతం నీటి కొరత ఏర్పడిందన్నారు. ఈ సమయంలో 20 ఎంజిడి నీటిని సరఫరా చేయలేదని, ఫలితంగా దక్షిణ ఢిల్లీలో మరో 25 శాతం నీటి కొరత ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
పైపులైన్లు పగులగొట్టి కొరతను తీవ్రతరం చేసేందుకు కుట్ర : అతిషి
అతిషి మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం ఢిల్లీలో తీవ్రమైన వేడిగాలులు వీస్తున్నాయని, నీటి కొరత సైతం ఉందని అన్నారు. ఈ క్రమంలో నీటి పైప్‌లైన్లను పగులగొట్టి కొరతను మరింత తీవ్రతరం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోందన్నారు. దక్షిణ ఢిల్లీలోని సరఫరా పైప్‌లైన్‌లో శనివారం భారీ లీకేజీ ఏర్పడిందని, ఈ విషయం తెలుసుకున్న తమ బృందం మరమ్మతుల కోసం ఓ టీమ్‌ను పంపగా, చాలా పెద్ద బోల్టులు కోసి ఉన్నట్లుగా గుర్తించారని అన్నారు. అనంతరం మంత్రి సౌరభ్‌ భరద్వాజ్‌ మాట్లాడుతూ.. కొద్దిరోజులు ఢిల్లీలో లీకేజీలు ఉన్నాయంటూ కొందరు నిర్దిష్ట వ్యక్తులు పలు వీడియోలను వైరల్‌ చేశారన్నారు. లీకేజీ సహజమని తాను అనుకోనని, కొందరు కావాలని లీకేజీలకు కారణమవుతున్నారని అన్నారు. శనివారం దక్షిణ ఢిల్లీలో పైపులు కట్టే నట్‌లు, బోల్డులు కోసి కనిపించాయన్నారు. వాటిని ఎవరో కట్‌ చేశారని, దాంతో దక్షిణ ఢిల్లీలో నీళ్లు లేవని అన్నారు. పైప్‌లైన్ల ధ్వంసం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని, ప్రజలు సైతం నిఘా వేసి ఉండాలని కోరారు.

➡️