‘మాకు ఛాన్సలర్‌ కావాలి, సావర్కర్‌ కాదు’ : క్యాంపస్‌లలో నిరసనల హోరు

Dec 19,2023 09:33 #campuses, #chancellor, #Protests, #Savarkar

తిరువనంతపురం : కేరళ, కొచ్చిన్‌ యూనివర్సిటీ సెనేట్లలో సంఫ్‌ుపరివార్‌కు చెందిన సభ్యులను నామినేట్‌ చేస్తూ చాన్సలర్‌ హౌదాను దుర్వినియోగపరుస్తున్న గవర్నర్‌ ఆరిఫ్‌ మహ్మద్‌ ఖాన్‌ చర్యలను నిరసిస్తూ విద్యార్థులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయ క్యాంపస్‌లలోను సోమవారం నిరసనలు హౌరెత్తాయి. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థులు కాలేజీలు, యూనివర్సిటీల్లో గవర్నర్‌ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. ‘సంఘీ ఛాన్సలర్‌ గోబ్యాక్‌’, ‘విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్లు కావాలి ”సార్వర్కరేయులు కాదు”, ”మిస్టర్‌ ఛాన్సలర్‌ దిస్‌ ఈజ్‌ కేరళ” అంటూ వారు బిగ్గరగా నినదించారు. ”మాకు ఛాన్సలర్‌ కావాలి, సావర్కర్‌ కాదు” అని రాసి ఉన్న బ్యానర్‌తో ఎర్నాకుళం మహారాజా కళాశాలలో విద్యార్థులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వ్యంగ్య చిత్రాలు గీసి గోడలపై అతికించారు. మలయాళం, హిందీ, అరబిక్‌ , ఆంగ్ల భాషల్లో నినాదాలు రాశారు. సాయంత్రం కళాశాల ఎదుట బ్యానర్లు, చిత్రపటాలతో తరలివచ్చి నిరసనకు సంఘీభావం తెలిపారు.డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో యువతీ యువకులు రాజ్‌భవన్‌ వరకు ప్రదర్శన నిర్వహించి ఛాన్సలర్‌కు వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ‘సంఘీచాన్సలర్‌ గోబ్యాక్‌’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్‌ మీడియాలో పలువురు గవర్నరు చర్యను నిరసించారు ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలోనూ నిరసనలు జరిగాయి.

➡️