ఆరో దశలో ఎవరికి మొగ్గు?

May 23,2024 00:45 #sixth phase?, #Who is favored

25న ఏడు రాష్ట్రాల్లో 58 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌
బరిలో 889 మంది అభ్యర్థులు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం చివరి దశకు చేరుకుంటుంది. ఇప్పటికే మెజార్టీ నియోజకవర్గాల్లో పోలింగ్‌ ముగిసింది. ఇంకా రెండు దశలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఈ నెల 25న ఆరో దశ, జూన్‌1న ఏడో దశ పోలింగ్‌తో లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ ప్రక్రియ ముగుస్తుంది. ఆరో విడత పోలింగ్‌లో ఏడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 57 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. బరిలో 889 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. దేశ రాజధానిలో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలతో పాటు హర్యానాలోని 10 స్థానాలకు ఈ విడతలో పోలింగ్‌ జరగనుంది. ఈ 57 లోక్‌సభ నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో ఎక్కువ సీట్లను ఎన్డీయే కూటమి గెలచుకుంది. ఈ సారి ఇండియా ఫోరం ఈ 58 స్థానాల్లో మెజార్టీ సీట్లు గెలుచుకుంటే అధికారానికి దగ్గరయ్యే ఛాన్స్‌ ఉంటుంది. ఈ స్థానాల్లో మెజార్టీ ఫిగర్‌కు ఇండియా ఫోరం చేరుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఆరో దశ ఎన్నికలు జరగనున్న 57 లోక్‌సభ స్థానాల్లో 2019లో కాంగ్రెస్‌ ఒక్కసీటు గెలుచుకోలేదు. అలాగే మరోవైపు ప్రాంతీయ పార్టీలకు ఆరో దశ ఎన్నికలు అగ్ని పరీక్ష కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆరో దశలో ఎవరు అధిపత్యం కనబరుస్తారనేది ఆసక్తికరంగా మారింది.

ఆరో దశలో ఎక్కడెక్కడ ఎన్ని స్థానాలు?
ఆరో దశలో ఉత్తరప్రదేశ్‌లో 14, బీహార్‌లో ఎనిమిది, హర్యానాలో పది, ఢిల్లీలో ఏడు, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది, జార్ఖండ్‌లో నాలుగు, ఒరిస్సాలో ఆరు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. ఈ 57 లోక్‌సభ స్థానాల్లో 2019లో 40 స్థానాల్లో బిజెపి విజయం సాధించింది. బిఎస్పీ నాలుగు, టిఎంసి మూడు, బిజెడి 4, జెడియు మూడు, ఎల్‌జెపి ఒకటి, ఎజెఎస్‌యు ఒకటి స్థానంలో విజయం సాధించాయి. ఎస్పీ కూడా ఒక్క సీటు గెలుచుకుంది. హర్యానా, ఢిల్లీలో బిజెపి క్లీన్‌ స్వీప్‌ చేసింది. ఈసారి ఢిల్లీ, హర్యానాలో బిజెపి హావా తగ్గే అవకాశం ఉందనే విశ్లేషకులు భావిస్తున్నారు.

యుపిలో గట్టి పోటీ
ఉత్తరప్రదేశ్‌లో సుల్తాన్‌పూర్‌, ప్రతాప్‌గఢ్‌, ఫుల్‌పూర్‌, ప్రయాగ్‌రాజ్‌, అంబేద్కర్‌నగర్‌, శ్వస్తీ, దుమ్రియాగంజ్‌, బస్తీ, సంత్‌ కబీర్‌నగర్‌, లాల్‌గంజ్‌, జాన్‌పూర్‌, అజంగఢ్‌, ఫిష్‌ సిటీ, భదోహి లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బిజెపి 9 సీట్లు, బిఎస్పీ 4, ఎస్పి ఒక సీటు గెలుచుకున్నాయి. గత ఎన్నికల్లో ఎస్పి, బిఎస్పి కలిసి పోటీ చేయగా.. ఈసారి కాంగ్రెస్‌, ఎస్పి కలిసి పోటీచేస్తున్నాయి. బిఎస్పి ఒంటరిగానే బరిలోకి దిగింది. ఎస్‌పి ఈసారి దళిత, ఒబిసి ఓటర్లపై ఫోకస్‌ పెట్టింది. ఈ ఓట్లను పొందడం ద్వారా యుపిలో బిజెపి స్పీడ్‌కు బ్రేకులు వేయాలనే ఆలోచనలో అఖిలేష్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఇండియా ఫోరం, ఎన్డీయే కూటమి మధ్య హౌరాహౌరీగా సాగుతున్న పోరులో బిఎస్పి ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది ఆసక్తి రేపుతోంది.

బీహార్‌, జార్ఖండ్‌లో …
బీహార్‌లోని వాల్మీకి నగర్‌, పశ్చిమ చంపారన్‌, తూర్పు చంపారన్‌, శివర్‌, వైశాలి, గోపాల్‌గంజ్‌, మహారాజ్‌గంజ్‌, సివాన్‌ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి. 2019లో బిజెపి నాలుగు, జెడియు మూడు, ఎల్‌జెపి ఒక సీటు గెలుచుకున్నాయి. ఈసారి పోటీ భిన్నంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్డీయే, ఇండియా వేదిక మధ్య ప్రధాన నెలకొంది. జార్ఖండ్‌లోనిని గిరిడి, ధన్‌బాద్‌, రాంచీ, జంషెడ్‌పూర్‌ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడా ఎన్డీయే, ఇండియా ఫోరం మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది.

బెంగాల్‌, ఒరిస్సాలో బలాబలాలు
పశ్చిమ బెంగాల్‌లోని ఎనిమిది లోక్‌సభ స్థానాలకు, ఒరిస్సాలోని ఆరు లోక్‌సభ స్థానాలకు ఆరో దశలో ఎన్నికలు జరుగనున్నాయి. బెంగాల్‌లోని తమ్లుక్‌, కాంతి, ఘటల్‌, ఝర్‌గ్రామ్‌, మెద్నీపూర్‌, పుర్లియా, బంకురా, బిష్ణుపూర్‌ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. 2019లో ఈ ఎనిమిది సీట్లలో బిజెపి ఐదు సీట్లు గెలుచుకోగా, టిఎంసి మూడు సీట్లు గెలుచుకుంది. ఒరిస్సాలోని సంబల్‌పూర్‌, కెంజోర్‌, ధెంకనల్‌, కటక్‌, పూరి, భునేశ్వర్‌ లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో బిజెపి రెండు సీట్లు గెలుచుకోగా, బిజెడికి నాలుగు సీట్లు గెలుపొందింది.

ఢిల్లీ, హర్యానాలో ఎలా ఉంది?
ఢిల్లీలోని మొత్తం ఏడు లోక్‌సభ స్థానాలు, హర్యానాలోని మొత్తం పది లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2014, 2019 ఎన్నికల్లో ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాలను బిజెపి గెలుచుకుంది. ఈసారి ఆమ్‌ ఆద్మీ, కాంగ్రెస్‌ కలిసి ఎన్నికల బరిలోకి దిగాయి. బిజెపి ఏడుగురు సిట్టింగ్‌ ఎంపిల్లో ఆరుగురికి టికెట్లు నిరకారించింది. వారి స్థానంలో కొత్త అభ్యర్థులను రంగంలోకి దింపింది. నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీ ఎంపి మనోజ్‌ తివారీకి మాత్రమే తిరిగి టికెట్‌ కేటాయించింది. అయితే ఈ స్థానంలో కాంగ్రెస్‌ కన్హయ్య కుమార్‌ను రంగంలోకి దించడం ద్వారా పోటీని ఆసక్తికరంగా మార్చింది. ఢిల్లీలోని ఏడు స్థానాల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో, కాంగ్రెస్‌ మూడు స్థానాల్లో పోటీ చేస్తోంది.

➡️