IMD : జులై నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం

Jul 2,2024 15:23 #IMD, #monsoon, #rainfall

న్యూఢిల్లీ :   జులై నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందనిభారత వాతావరణ శాఖ (ఐఎండి) మంగళవారం ప్రకటించింది. షెడ్యూల్ కన్నా  ఆరు రోజుల ముందుగానే  నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయని తెలిపింది.  రాజస్థాన్‌, హర్యానా, పంజాబ్‌లోని మిగిలిన ప్రాంతాల్లో నేడు విస్తరించనున్నట్లు తెలిపింది. సాధారణంగా జులై 8 నాటికి నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరిస్తాయని, కానీ ఈ ఏడాది జులై 2 నాటికే దేశం మొత్తాన్ని కవర్‌ చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.

జూన్‌ 11 నుండి 27 వరకు దేశంలో 16 రోజులు సాధారణం కంటే తక్కువ వర్షపాతం రికార్డైంది. మొత్తంగా జూన్‌లో సాధారణం కన్నా తక్కువ వర్షపాతానికి దారితీసింది. జూన్‌ నెలలో సాధారణ వర్షపాతం 165.3 మి.మీ కాగా, కేవలం 147.2 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఇది 2001 నుండి ఏడవ అతి తక్కువ వర్షపాతం కావడం గమనార్హం. దేశంలో నాలుగు నెలల వర్షాకాల సమయంలో మొత్తం 87 సెం.మీ వర్షపాతంలో జూన్‌నెల 15 శాతం మాత్రమే ఉన్నట్లు ఐఎండి తెలిపింది.

ఈ ఏడాది రుతుపవనాలు రెండు నుండి ఆరు రోజుల ముందుగానే మే 30న కేరళ, ఈశాన్య ప్రాంతాలను తాకినట్లు వెల్లడించింది. ఇవి సాధారణంగా మహారాష్ట్ర వరకు వేగంగా విస్తరించినప్పటికీ.. పశ్చిమబెంగాల్‌, ఒడిశా, జార్ఖండ్‌, బీహార్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ మరియు యుపిలలో ప్రవేశించేందుకు కొంతమేర మందగించాయి. అదే సమయంలో వాయువ్య భారతదేశంలో వడగాల్పులపై తీవ్ర ప్రభావం చూపాయి.

➡️