మిజోరంలో జెడ్‌పిఎం ఘన విజయం

Dec 4,2023 09:06 #Electon, #Mizoram
  • ఎన్నికలపై మణిపూర్‌ అల్లర్ల ప్రభావం
  • మూడు దశాబ్దాల రెండు కూటముల వ్యవస్థకు తెర
  • ముఖ్యమంత్రి పీఠంపై కొత్త ముఖం

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో/ ఐజ్వాల్‌:ఈశాన్య రాష్ట్రం మిజోరంలో మాజీ ఐపిఎస్‌ అధికారి లాల్‌ దహోమా నేతృత్వంలోని జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (జెడ్‌పిఎం) ఘన విజయం సాధించింది. అధికార మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎంఎన్‌ఎఫ్‌) ఘోర పరాజయాన్ని చవిచూసింది. గత మూడు దశాబ్దాలుగా మిజోరం రాజకీయాల్లో రాటుదేలిన యోధుడు 79 ఏళ్ల లాల్‌ దహోమా రూపంలో మిజోరం కొత్త ముఖ్యమంత్రిని చూడబోతోంది. 35 ఏళ్ల పాటు మిజోరంలో అధికార మార్పిడి ఎంఎన్‌ఎఫ్‌, కాంగ్రెస్‌ల మధ్యే సాగుతూ వచ్చింది. ఇప్పుడు ఆ రెండు కూటముల వ్యవస్థకు తెర దించుతూ ప్రత్యామ్నాయంగా జెడ్‌పిఎం ముందుకొచ్చింది. 40 స్థానాలున్న మిజోరం అసెంబ్లీకి నవంబరు 7న పోలింగ్‌ జరగ్గా.. 80 శాతానికి పైగానే పోలింగ్‌ నమోదైంది. ఫలితాలు తెలంగాణ, మధ్య ప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌తో బాటు ఆదివారం నాడే వెలువడాల్సి ఉన్నప్పటికీ, ఆ రోజు క్రైస్తవుల పవిత్ర దినమైనందున రాజకీయ పార్టీలు, పౌర సమాజం, చర్చి నుంచి అనేక విజ్ఞప్తులు రావడంతో ఎన్నికల సంఘం వీటిని ఒక రోజుపాటు వాయిదా వేసింది. జెడ్‌పిఎం 27, ఎంఎన్‌ఎఫ్‌ 10, బిజెపి 2, కాంగ్రెస్‌ 1 స్థానంలో గెలుపొందాయి. మిజోరంలో 16 మంది మహిళలు సహా 174 మంది అభ్యర్థులు పోటీ చేశారు. మొత్తం 40 స్థానాల్లోనూ మిజో నేషనల్‌ ఫ్రంట్‌, ప్రతిపక్ష జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌, కాంగ్రెస్‌ పార్టీలు పోటీ చేశాయి. బిజెపి 23 స్థానాల్లో, ఆమ్‌ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేశాయి. గత ఎన్నికలతో పోల్చితే జెడ్‌పిఎంకు 19 సీట్లు, బిజెపికి 1 సీటు పెరగ్గా, ఎంఎన్‌ఎఫ్‌కు 16 సీట్లు, కాంగ్రెస్‌కు 4 సీట్లు తగ్గాయి. జెడ్‌పిఎంకు 15.77 శాతం ఓట్లు పెరగ్గా, ఎంఎన్‌ఎఫ్‌కు 2.6 శాతం, కాంగ్రెస్‌కు 9.16 శాతం, బిజెపికి 3.03 శాతం ఓట్లు తగ్గాయి.ముఖ్యమంత్రి జోరంతంగ ఓటమిమిజోరం ముఖ్యమంత్రి, ఎంఎన్‌ఎఫ్‌ అధ్యక్షులు జోరంతంగ ఐజ్వాల్‌ ఈస్ట్‌-1 నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇది ఎంఎన్‌ఎఫ్‌కి పెద్ద ఎదురుదెబ్బగా చెప్పొచ్చు. ముఖ్యమంత్రి జోరంతంగపై జెడ్‌పిఎం అభ్యర్థి లల్తన్‌సంగ 2,101 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఉపముఖ్యమంత్రి తౌన్‌లూయా, ఆరోగ్య మంత్రి ఆర్‌ లాల్తాంగ్లియానా, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి లరుత్కిమా కూడా ఓటమి పాలయ్యారు. ఐజ్వాల్‌ వెస్ట్‌-3లో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షులు లాల్సవతా ఓడిపోవడంతోపాటు మూడో స్థానానికి పరిమితమయ్యారు.

  • ఎన్నికలపై మణిపూర్‌ అల్లర్ల ప్రభావం
  • ఎన్‌డిఎలో ఉండటమే ఎంఎన్‌ఎఫ్‌ ఓటమికి కారణం

ఐజ్వాల్‌: పొరుగున ఉన్న మణిపూర్‌లో జాతుల, మతపరమైన అల్లర్లు, మయన్మార్‌ శరణార్థుల సమస్య మిజోరం ఎన్నికలపై నిర్ణయాత్మక ప్రభావాన్ని చూపాయి. అల్లర్ల నేపథ్యంలో మణిపూర్‌ నుంచి వచ్చిన చాలా మంది ప్రజలు మిజోరంలో ఆశ్రయం పొందారు. సైనిక తిరుగుబాటు తరువాత మయన్మార్‌ నుంచి వచ్చిన 50,000 మందికి పైగా చిన్‌ శరణార్థులు మిజోరంలో ఆశ్రయం పొదారు. వీరిలో ఎవరికీ రాష్ట్రంలో ఓటు హక్కు లేదు. మణిపూర్‌ శరణార్థులపై ఆంక్షలు విధించినప్పుడు మిజోరం బహిరంగ విధానాన్ని అవలంభించింది. శరణార్థుల బయోమెట్రిక్‌ సమాచారాన్ని నమోదు చేసే కేంద్ర ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తి వ్యక్తమైంది. ఎన్‌డిఎ కూటమిలో భాగమైనప్పటికీ ఎంఎన్‌ఎఫ్‌ మీసో సెంటిమెంట్‌కు అండగా నిలిచింది. ‘చిన్‌ ప్రజలు మా సోదరులు. వారికి ఆశ్రయం కల్పించాలి’ అని మిజోరం ముఖ్యమంత్రి జోరంతంగ స్పందించారు.

మణిపూర్‌లో కుకీ, మైతీల ఘర్షణల సమయంలో కుకీలు జో తెగకు చెందిన వారనే కారణంతో వారికి మిజోరం ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. మణిపూర్‌ అల్లర్లలో బిజెపి వైఖరిపై ఎంఎన్‌ఎఫ్‌ అసంతృప్తిగా ఉంది. 2018లో బిజెపి 39 స్థానాల్లో పోటీ చేసి ఒక్కటి గెలుచుకోగా, ఈసారి 28 స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలిచింది.

  • కొత్త పార్టీకి అవకాశం

1987లో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మిజోరంలో ఇప్పటి వరకు మిజో నేషనల్‌ ఫ్రంట్‌ (ఎన్‌ఎంఎఫ్‌), కాంగ్రెస్‌ మారుతూ పాలించాయి. గత ఎన్నికలు (2018) వరకు కాంగ్రెస్‌, ఎంఎన్‌ఎఫ్‌ ప్రధాన రాజకీయ ప్రత్యర్థులు. 2018లో 40 అసెంబ్లీ స్థానాల్లో 26 స్థానాలను గెలుచుకుని ఎంఎన్‌ఎఫ్‌ అధికారంలోకి వచ్చింది. దీంతో దేశ రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఈశాన్య రాష్ట్రాల్లో ఒక్కదానిలో కూడా కాంగ్రెస్‌ అధికారంలో లేకుండా పోయింది. జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ ఎనిమిది స్థానాల్లో విజయం సాధించి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది. 2019లో జెడ్‌పిఎంను ఎన్నికల సంఘం రాజకీయ పార్టీగా గుర్తించింది. ఈశాన్య రాజకీయాల్లో, మిజోరంలో కొత్త రాజకీయ పార్టీ జెడ్‌పిఎం అధికారాన్ని సొంతం చేసుకుంది. అన్ని స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గతసారి ఐదు సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్‌, ఈసారి ఒక్క సీటుతో సరిపెట్టుకుంది. జెడ్‌పిఎం ఓట్ల శాతం భారీగా పెరిగింది. మణిపూర్‌, మయన్మార్‌ల నుంచి మిజోరంలో ఆశ్రయం పొందుతున్న వారికి రక్షణ కల్పించాలని ముఖ్యమంత్రి జోరంతంగ నిర్ణయించినప్పటికీ, ఎన్‌డిఎతో పొత్తు వల్ల మసకబారింది.

  • కొత్త సారథి లాల్‌ దహోమా..!

జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీని నడిపిస్తున్న 79 ఏళ్ల లాల్‌ దహోమా గతంలో ఐపిఎస్‌ అధికారిగా పని చేశారు. గోవాలో జీవితం ప్రారంభించిన దహోమా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భద్రతా ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వర్తించారు. 1972 నుండి 1977 వరకు మిజోరం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. ఆ తర్వాత ఉద్యోగాన్ని వదులుకుని కాంగ్రెస్‌ పార్టీ తరపున 1984లో లోక్‌సభలో అడుగుపెట్టారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీని వీడి దేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టంపై అనర్హత వేటు పడిన మొదటి ఎంపిగా నిలిచారు. 2017లో జోరామ్‌ నేషనలిస్ట్‌ పార్టీ స్థాపించి ఆ తర్వాత జోరామ్‌ పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ కూటమిలో చేరారు. 2018లో ఆ కూటమి తరపున ముఖ్యమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దిగి ఓటమి చవి చూశారు. 2021లో మళ్లీ ఎంపిగా పార్లమెంట్‌లో అడుగు పెట్టారు. ప్రస్తుత ఎన్నికల్లో జెడ్‌పిఎం విజయం సాధించడంతో, లాల్‌ దహోమానే ముఖ్యమంత్రి కానున్నారు.

➡️