అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించకపోతే 26 తర్వాత ప్రత్యక్ష మద్దతు

Dec 22,2023 09:50 #cpm v srinivasarao, #press meet

– వామపక్ష పార్టీల నిర్ణయం-

మద్దతు కొనసాగించాలని ప్రజలకు విజ్ఞప్తి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో అంగన్‌వాడీల సమస్యల విషయంలో ప్రభుత్వం స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించని పక్షంలో అంగన్‌వాడీలు సాగించే ఉద్యమానికి 26 తర్వాత ప్రత్యక్ష మద్దతు ఇవ్వాలని వామపక్ష పార్టీలు నిర్ణయించాయి. గురువారం సిపిఎం రాష్ట్ర కార్యాలయంలో పది వామపక్ష పార్టీల సమావేశం సిపిఐఎంఎల్‌ రాష్ట్ర నాయకులు జాస్తి కిషోర్‌బాబు అధ్యక్షతన జరిగింది. దీనికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, కార్యదర్శివర్గ సభ్యులు జి ఓబులేసు, రెండు న్యూడెమొక్రసీ పార్టీల నుండి పి ప్రసాదు, కె పొలారి, రామకృష్ణ, సిపిఐఎంఎల్‌ లిబరేషన్‌ నాయకులు హరినాథ్‌, ఫార్వార్డ్‌బ్లాక్‌ నాయకులు పివి సుందరరామరాజు, ఆర్‌ఎస్‌పి నాయకులు రవికాంత్‌ హాజరయ్యారు. అంగన్‌వాడీల సమ్మె జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలపై చర్చించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో వామపక్ష పార్టీల తరపున శ్రీనివాసరావు, రామకృష్ణ, ప్రసాదు మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో సమ్మెకు దిగుతామని నెలరోజుల క్రితమే అంగన్‌వాడీలు ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారని తెలిపారు. ప్రభుత్వం అప్పటి నుండి పట్టించుకోకుండా చివర్లో చర్చల పేరుతో కాలయాపనకు ప్రయత్నించిందని, అందులో చిన్న చిన్న అంశాలపై సానుకూలంగా స్పందించినా వాటికీ జిఓ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తెలిపారు. అక్కచెల్లెమ్మల సంక్షేమం అని చెబుతున్న సిఎం ఆచరణలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని వివరించారు. గ్రాట్యుటీ, వేతన పెంపు గురించి నోరెత్తడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా ప్రభుత్వ సిబ్బంది మధ్య గొడవ పెట్టే విధంగా వ్యవహరిస్తూ ఘర్షణ వాతావరణాన్ని సృష్టిస్తోందని పేర్కొన్నారు. జగన్‌ పుట్టినరోజు సందర్భంగా అన్నా సమస్యను పరిష్కరిస్తారని అంగన్‌వాడీలు ఎదురు చూస్తున్నారని, ఆశనిరాశ చేయొద్దని సూచించారు. రూ.525 కోట్లు పెట్టి గెస్ట్‌హౌస్‌ కట్టుకున్నారని, భవనాలపై ఉన్న శ్రద్ధ లక్షమంది అంగన్‌వాడీ మహిళలపై లేదని మండిపడ్డారు. రూ.20 వేల కోట్లు పెట్టి ఎవరూ కోరకపోయినా, వద్దంటున్నా స్మార్ట్‌ మీటర్లు పెడుతున్నారని, దానివల్ల షిర్డిసాయి ఎలక్ట్రికల్స్‌, అదానీకి లబ్ధి కలిగించడం, మోడీని సంతృప్తి పరచడం వైసిపి ప్రభుత్వం లక్ష్యంగా కనిపిస్తోందని, రాష్ట్రంలో గెలిపించిన మహిళల సంక్షేమం మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. అసలు అంగన్‌వాడీల విషయంలో ప్రభుత్వ విధానం ఏమిటో తెలపాలని డిమాండ్‌ చేశారు. అంగన్‌వాడీలు కూడా 25 నుండి సమ్మెను ఉధృతం చేస్తామంటున్నారని, ఈలోపే సమస్యను పరిష్కరించాలని వారు కోరారు. వేతనాలు పెంచాలని కోరితే అప్పుల్లో ఉన్నామని చెబుతున్నారని, అంగన్‌వాడీల కోసం కొంత అప్పుచేస్తే ఎవరైనా వద్దన్నారా? అని ప్రశ్నించారు. ఏజెన్సీలోని చింతపల్లిలో ముఖ్యమంత్రి బైజూస్‌కు సొమ్ము కట్టబెట్టడానికి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేస్తున్నారని, అదే ఏజెన్సీలో గిరిజనుల భూములు గుంజుకుంటున్నారని మండిపడ్డారు. వేలకోట్లు కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని మానుకుంటే అంగన్‌వాడీల వేతనాలు పెంచొచ్చని సూచించారు. పైగా వేతనాలు పెంచమని కోరుతున్న వారిని వదిలేసి వారిపై రెచ్చగొట్టేందుకు వలంటీర్లకు గౌరవ వేతనం పెంచుతున్నట్లు ప్రకటించి, అంగన్‌వాడీలను కవ్విస్తున్నదని ఇదేమీ న్యాయమో, పాలనో అర్థం కావడం లేదని అన్నారు. 30 లక్షల కుటుంబాల్లో పిల్లలకు తల్లులుగా మారిన అంగన్‌వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రజాస్వామ్యానికి ప్రమాదం పార్లమెంటులో 143 మంది ఎంపిలను సస్పెండ్‌ చేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వారు తెలిపారు. బిజెపి సిఫార్సు లేఖతో అగంతకులు పార్లమెంటులో దూకారని, దానిపై సమాధానం చెప్పాలని అడిగితే ఎంపిలను సస్పెండ్‌ చేయడం అప్రజాస్వామికమని అన్నారు. సస్పెన్షన్లను వామపక్ష పార్టీలుగా తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. 22వ తేదీన ఇండియా వేదిక పిలుపునకు వామపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి.

➡️