అండగా నిలిచే పార్టీలకే మద్దతు – జయలక్ష్మి సొసైటీ బాధితుల సంఘం నిర్ణయం

ప్రజాశక్తి-కాకినాడ రూరల్‌ :జయలక్ష్మి కో-ఆపరేటివ్‌ సొసైటీ బాధితులకు అండగా నిలిచే రాజకీయ పార్టీలకు రాబోయే ఎన్నికల్లో తమ మద్దతు ఉంటుందని సొసైటీ బాధిత సంఘం సభ్యులు తెలిపారు. జయలక్ష్మి సొసైటీ యాజమాన్యం ఇష్టానుసారంగా రుణాల మంజూరు చేయడం, సొంతానికి వాడుకోవడం, 19 వేల మందికి చెందిన రూ.582 కోట్ల డిపాజిట్లు కొల్లగొట్టిన సంగతి తెలిసిందే. కోట్లాది డిపాజిట్లు తీసుకుని స్వాహాకు పాల్పడిన జయలక్ష్మి సొసైటీ పాత కార్యవర్గం చైర్మన్‌, వైస్‌చైర్మన్‌లతోపాటు ఇతర డైరెక్టర్ల ఆస్తులను సిబిసిఐడి అధికారులు సీజ్‌ చేశారు. నూతన కార్యవర్గం జారీ చేసిన నోటీసులకు లోబడి కొంత మంది రుణ గ్రహీతలు రూ.1.50 కోట్లు చెల్లించారు. ఈ క్రమంలో కాకినాడలోని సర్పవరం జంక్షన్‌లో గల జయలక్ష్మి కోపరేటివ్‌ సొసైటీ కార్యాలయం ఎదుట బాధిత సంఘం సభ్యులు శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాలు, అంగర నరసింహారావు, చిప్పల శంకరం, కృష్ణారావు, పల్లంరాజు, రాజగోపాలు మాట్లాడుతూ.. పాత చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌లతోపాటూ డైరెక్టర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారన్నారు. అయితే, నూతన పాలకవర్గ చైర్మన్‌ గంగిరెడ్డి త్రినాధరావు ఆధ్వర్యంలో నిందితుల ఆస్తులను గుర్తించి న్యాయస్థానం ద్వారా సీజ్‌ చేయడం జరిగిందని తెలిపారు. 50 మంది బాధితులు చనిపోతే ప్రభుత్వం నయాపైసా నష్ట పరిహారం చెల్లించకపోవడం దారుణమన్నారు. సుమారు 300 కోట్లు స్థిరాస్తులు ఉన్నాయని, అడ్వాన్సుగా బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం రూ.150 కోట్లు ఇవ్వాలని కోరినా పట్టించుకోలేదన్నారు. సీజ్‌ చేసిన ఆస్తులను విక్రయించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని కోరారు. సుమారు 20 వేల మంది బాధితులు ఉన్నారని, ఉమ్మడి విశాఖ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో బాధితుల కుటుంబాలకు చెందిన సుమారు 2 లక్షల ఓట్లు ఉన్నాయన్నారు. బాధితుల సంఘం నుంచి ఒక్కో నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపి సత్తా చూపిస్తామని తెలిపారు. జయలక్ష్మి సొసైటీ కార్యకలాపాలు, ఆస్తుల సీజ్‌, నిందితులకు సమన్లు, ఎఫ్‌ఐఆర్‌ నమోదు, స్థిరాస్తుల సీజ్‌, సేల్‌ ఆర్డర్‌ కోసం చట్టబద్ధ, న్యాయబద్ధంగా తీసుకున్న చర్యలపై జయలక్ష్మి సొసైటీ చైర్మన్‌ గంగిరెడ్డి త్రినాధరావు వివరించారు.

➡️