‘అనంత’లో ఆకలి చావు!

Mar 25,2024 09:13 #ananthapuram, #Starve to death

-కొన్ని నెలలుగా విగ్రహం నీడనే జీవనం
-దయనీయ స్థితిలో గర్భిణి మృతి
-కలెక్టరేట్‌ ఎదుటే ఘటన
ప్రజాశక్తి- అనంతపురం సిటీ :కరువు సీమ అనంతపురంలో ఆకలి చావు సంభవించింది. తిండిలేక గర్భిణి మరణించింది. మద్యానికి బానిసైన భర్త పట్టించుకోకపోవడం, ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఎటువంటి సంక్షేమ పథకాలు అందకపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. కలెక్టరేట్‌ ఎదుటే ఆమె కుటుంబం నాలుగేళ్లుగా ఉంటోంది. అయినా, ఏ అధికారికీ ఆ కుటుంబం గురించి పట్టలేదు. స్థానికుల కథనం ప్రకారం… అనంతపురం నగరంలోని టివి టవర్‌ వద్ద నివసించే ఓ దళిత కుటుంబానికి చెందిన అంజలి (29) తనకు 14 సంవత్సరాల వయసులో బిసి సామాజిక తరగతికి చెందిన రాజు అనే యువకుడిని ప్రేమించింది. మైనార్టీ కూడా తీరని అంజలి పెద్దలను ఎదిరించి రాజును పెళ్లి చేసుకుంది. కొన్ని రోజులు వారి జీవనం సజావుగా సాగింది. వారికి ముగ్గురు సంతానం కలిగారు. రాజు తాగుడుకు బానిసయ్యాడు. భార్య, పిల్లలను పట్టించుకోవడం మానేశాడు. దీంతో, వారి జీవనం కష్టంగా మారింది. ఆ కుటుంబం నివసించడానికి నీడ కూడా కరువైంది. దీంతో, కలెక్టరేట్‌ ఎదుట చెరువు కట్ట మీదకు వెళ్లే దారిలో ఉండే ఫాదర్‌ విన్సెంట్‌ ఫెర్రర్‌ విగ్రహం కింద నాలుగు సంవత్సరాలుగా ఆ కుటుంబం ఉంటోంది. ముగ్గురు పిల్లలను ప్రతి రోజూ దేవాలయాల వద్ద భిక్షాటనకు కూర్చోబెట్టి వచ్చిన డబ్బుతో రాజు మద్యం సేవించేవాడు. కొద్దోగొప్పో మిగిలిన డబ్బుతో ఏదైనా తిండి తెచ్చుకుని తినేవారు. ప్రస్తుతం అంజలి నాలుగు నెలల గర్భిణి. ఆమెకు కనీస పోషకాహారం లేకపోవడంతో బలహీనంగా మారింది. ఈ నేపథ్యంలో అంజలి శనివారం మధ్యాహ్నం కలెక్టరేట్‌ ఎదుట రోడ్డు దాటుతున్న సమయంలో ద్విచక్ర వాహనం ఢకొీంది. ఈ ప్రమాదంలో అంజలి కింద పడినా తిరిగి పైకిలేచి నడుచుకుంటూ తాను నివసిస్తున్న విగ్రహం వద్దకు చేరుకుంది. రాత్రి రెండు గంటల సమయంలో తన భర్త రాజును నిద్రలేపి తనకు బాగా ఆకలిగా ఉందని చెప్పింది. అయినా, అతను పట్టించుకోలేదు. ఆకలితో అలమటిస్తూ అంజలి ఆదివారం తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో మరణించింది. ఉదయం గమనించిన అక్కడున్న వారు మున్సిపల్‌ అధికారులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న సాయి ట్రస్ట్‌ అధ్యక్షులు విజయసాయి కుమార్‌, ట్రస్టు సభ్యులు అక్కడికి వెళ్లారు. పోలీసులకు సమాచారం అందించి తహశీల్దార్‌ అనుమతితో ప్రత్యేక వాహనంలో జెఎన్‌టియు రోడ్‌లోని వైకుంఠఘాట్‌లో అంజలికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు.
కనీస సాయం కరువు
ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ఎటువంటి సంక్షేమ పథకాలూ అందలేదని సమాచారం. కనీసం బియ్యం కార్డు ఉన్నా అంజలి ఆకలి చావుకు గురయ్యేది కాదని స్థానికులు చర్చించుకున్నారు. రాజుకు ఆధార్‌ కార్డు ఉంది. అంజలికి, ఆమె ముగ్గురు పిల్లలకు ఆధార్‌ కార్డు కూడా లేదు. తాగుడుకు బానిసైన రాజు ఆ పిల్లలను ఏమైనా చేస్తాడని, జిల్లా కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకుని ఆ పిల్లలకు హాస్టల్లో ఆశ్రయం కల్పించి వారి భవిష్యత్తుకు బాట వేయాలని మానవతావాదులు కోరుతున్నారు.

➡️