ఈనెల 17న జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌ -14 ప్రయోగం

Feb 15,2024 21:36 #experiment, #raket

– వాతావరణ మార్పులపై అధ్యయనం

ప్రజాశక్తి-సూళ్లూరుపేట: శ్రీహరి కోట నుంచి ఈనెల 17న సాయంత్రం 5.30 గంటలకు జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌-14 ప్రయోగానికి శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. ఈ రాకెట్‌ ద్వారా భారత వాతావరణ ఉపగ్రహం ఇన్‌శాట్‌- 3డి ఎస్‌ను ప్రయోగించనున్నారు. వాతావరణ అంచనాలు, విపత్తులను ముందుగా పసిగట్టడానికి ఈ ప్రయోగం చేపట్టనున్నారు. ఎప్పటికప్పుడు వాతావరణంలో జరిగే మార్పులు గమనించి భూ కేంద్రాలకు కచ్చితమైన సమాచారం అందించడానికి కేంద్ర ప్రభుత్వ ఎర్త్‌ సైన్సెస్‌ శాఖ కోసం ఈ ప్రయోగాన్ని జరపనుంది. వాతావరణ సంబంధమైన అంశాలను అధ్యయనం చేసేందుకు ప్రయోగిస్తున్న ఈ ఉపగ్రహం బరువు 2,275 కేజీలు. పిఎస్‌ఎల్‌వి రాకెట్‌ను నాలుగు దశల్లో ప్రయోగిస్తే జిఎస్‌ఎల్‌విని మూడు దశల్లో ప్రయోగించనున్నారు. 51.7 మీటర్ల పొడవైన జిఎస్‌ఎల్‌వి ఎఫ్‌-14 రాకెట్‌ ప్రయోగ సమయంలో 420 టన్నుల బరువుతో భూమి నుంచి నింగికి దూసుకెళ్లనుంది. షార్‌లోని రెండవ వేదిక వద్ద ఇప్పటికే రాకెట్‌ ప్రయోగానికి సంబంధించి తుది ఏర్పాట్లు జోరందుకున్నాయి. జిఎస్‌ఎల్‌వి మార్కు-2 సిరీస్‌లో ఇది 16వ ప్రయోగం.

➡️