ఉస్మానియా ఆస్పత్రి నుంచి జ్యోతి డిశ్చార్జ్‌..

Feb 21,2024 16:50 #disagree, #tribal welfare ee

హైదరాబాద్‌ : ట్రైబల్‌ వెల్ఫేర్‌ అధికారిణి జ్యోతి రెండు రోజుల డ్రామాకు తెర పడింది. కాసేపటి క్రితమే జ్యోతిని ఉస్మానియా వైద్యులు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ చేశారు. ట్రైబల్‌ వెల్ఫేర్‌లో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు జ్యోతి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. అయితే ఆరోగ్యం బాగోలేదంటూ లేడీ ఆఫీసర్‌ ఆసుపత్రిలో చేరారు. ఏసీబీకి పట్టుబడిన వెంటనే అస్వస్థత పేరు చెప్పి జ్యోతి ఆస్పత్రిలో చేరారు. చికిత్స కోసం జ్యోతిని ఉస్మానియా ఆస్పత్రికి ఏసీబీ అధికారులు తరలించారు. జ్యోతి ఆరోగ్యంగా ఉందంటూ ఉస్మానియా వైద్యలు బుధవారం డిశ్చార్జ్‌ చేశారు.

ఆ వెంటనే లేడీ అధికారిణిని ఏసీబీ న్యాయస్థానం ముందు అధికారులు హాజరుపర్చారు. అయితే 24 గంటలు దాటిన మెజిస్ట్రేట్‌ ముందు హాజరు పర్చలేదు కాబట్టి రిమాండ్‌ రిజెక్ట్‌ చేయాలని జ్యోతి తరుపు న్యాయవాది వాదించారు. జ్యోతికి అనారోగ్య సమస్య కారణంగా హాస్పిటల్‌లో అడ్మిట్‌ చేశామని కోర్టుకు ఏసీబీ చెప్పింది. అరెస్ట్‌ చూపించిన 24 గంటలకు ఎందుకు రిమాండ్‌ చేయలేదని కోర్ట్‌ ప్రశ్నించగా… హాస్పిటల్‌లో ఉన్న కారణంగా రిమాండ్‌ చేయలేదని నిన్న మెమో దాఖలు చేసినట్టు కోర్ట్‌కు ఏసీబీ తెలిపింది. దీంతో జ్యోతికి ఏసీబీ కోర్టు 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. మార్చ్‌ 6 వరకు జ్యోతికి కోర్టు రిమాండ్‌ విధించింది.

కాగా… దాదాపు రూ.84వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు జ్యోతి పట్టుబడగా.. ఆ తరువాత ఆమె నివాసంలో సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు విస్తుపోయారు. జ్యోతి ఇంట్లో 3.6 కేజీల బంగారం, 65 లక్షల నగదు, వ్యవసాయ భూమి పత్రాలు, ఓపెన్‌ ఫ్లాట్స్‌ పాత్రలను ఏసీబీ సీజ్‌ చేసింది. జ్యోతిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును ఏసీబీ నమోదు చేయనుంది. జ్యోతి ఆస్తులు మరికొన్ని బీనామీలపై ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది.

➡️