ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకాది: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: కేంద్ర మాజీ మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) కుమారులైన వివేక్‌, వినోద్‌లను చూస్తే తనకు రామాయణంలో లవకుశలు గుర్తుకొస్తారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ బాగ్‌లింగంపల్లిలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ న్యాయ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం, గ్రాడ్యుయేషన్‌ డేకు రేవంత్‌ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘ఎంత సంపాదించామన్నది కాదు.. సమాజానికి ఎంత పంచామన్నది’ కాకా విధానమని రేవంత్‌ కొనియాడారు.”ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన ఘనత కాకాది. దేశ నిర్మాణంలో ఆయన తన సామాజిక బాధ్యతను నిర్వర్తించారు. ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యార్థులకు విద్యనందిస్తున్న ఘనత కాకా కుటుంబానిది. నిర్దిష్టమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఆ దిశగా పనిచేస్తే కచ్చితంగా గమ్యాన్ని చేరుకోవచ్చు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కఠోర దీక్షతో తెలంగాణను దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. డబ్బులుంటేనే రాజకీయాలు అనే ఆలోచన పక్కన పెట్టాలి. ఇందిరమ్మ ఇంట్లో నివసించే సామాన్యుడు కూడా ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సేవ చేస్తే ప్రజలు తప్పకుండా ఆదరిస్తారు” అని రేవంత్‌ తెలిపారు.

➡️