ఎపిడిడిసిఎఫ్‌ చైర్మన్‌గా సుధీర్‌రెడ్డి

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా):ఆంధ్రప్రదేశ్‌ డెయిరీ డెవలప్‌మెంట్‌ కో-ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌గా చిల్లకూరి సుధీర్‌రెడ్డి బాధ్యతలు చేపట్టారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎపిఐఐసి భవనంలోని ఫెడరేషన్‌ కార్యాలయంలో బుధవారం రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, ఫెడరేషన్‌ ఎండి అహ్మద్‌బాబు సమక్షంలో సుధీర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగున్నరేళ్లలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారని, రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు, అమూల్‌ ద్వారా పాల సేకరణ వంటివి సిఎం ఆలోచనల నుండి పుట్టినవేనని చెప్పారు. జగనన్న పాల వెల్లువతో పాడి రైతులకు మద్దతు ధర కల్పించారన్నారు. కార్యక్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన వైసిపి ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

➡️