ఓటుతోనే సమాజ మార్పు

Feb 12,2024 08:11 #high court ex judge, #speech

– సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ అధ్యక్షులు భవానీ ప్రసాద్‌

– రాష్ట్రంలో నిశబ్ద విప్లవం ఆరంభమైంది : నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌

ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి: ఓటుతోనే సమాజ మార్పు అని, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ అధ్యక్షులు, హైకోర్టు మాజీ న్యాయమూర్తి భవానీ ప్రసాద్‌ అన్నారు. ‘ఓటు వేద్దాం – ప్రజాస్వామ్య పరిరక్షణ’ పేరుతో కర్నూలులోని త్రిగుణ ఇన్‌ హోటల్‌లో ఆదివారం ఆ సంస్థ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ఉండాల్సిన స్థితిలో లేదన్నారు. రాను రాను నైతికంగా పతనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నుకోవాల్సిన వారిని ఎన్నుకోకపోతే మన భవిష్యత్తు ప్రశ్నార్థకంగా తయారవుతుందని తెలిపారు. సరైన వారిని ఎన్నుకోకపోవడం వల్ల అత్యధిక మంది ప్రజలు బాధను అనుభవిస్తున్నారన్నారు. డబ్బు, మద్యం కోసం ఓటు వేసే పరిస్థితిని మార్చగలిగితే సమాజం ముందుకు వెళుతుందని తెలిపారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కార్యదర్శి, ఎపి మాజీ ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో నిశబ్ద విప్లవం ఆరంభమైందని, బెదిరింపులకు లంగకుండా ఓటు వేసే పరిస్థితి వస్తుందని తెలిపారు. పౌరుల్లో సామాజిక బాధ్యతను గుర్తు చేయడానికే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎన్నికల కమిషన్‌ నిస్పక్షపాతంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ విచక్షణతో ఓటు వేయాలని కోరారు. సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ ఉపాధ్యక్షులు, మాజీ ముఖ్య కార్యదర్శి ఎల్‌వి.సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రగల్బాలు పలికిన నాయకులు ఎన్నికల తరువాత ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. దోచుకోవడంపై ఉన్న దృష్టి ప్రజలకు ఇచ్చిన హామీలపై ఉండడంలేదని విమర్శించారు. ప్రజల్లో చైతన్యం ఉంటే సరిపోదని, ప్రజాప్రతినిధుల్లోనూ చైతన్యం తేవాలన్నారు. సమావేశంలో లెట్స్‌ ఓట్‌ సంస్థ జాతీయ కన్వీనర్‌ సుబ్బరంగయ్య, సిటిజన్స్‌ ఫర్‌ డెమోక్రసీ కోశాధికారి పాల్గుణ కుమార్‌, కార్యవర్గ సభ్యులు, తెలంగాణ మాజీ ఎన్నికల ప్రధానాధికారి నాగిరెడ్డి, పి.రఘు, రాంశంకర్‌నాయక్‌, గాడిచర్ల ఫౌండేషన్‌ అధ్యక్షులు కల్కూర చంద్రశేఖర్‌ పాల్గన్నారు. ఓటు వేద్దాం అనే కరపత్రాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించారు.

➡️