కాంగ్రెస్‌, బిజెపి మధ్య రహస్య మైత్రి బయటపడింది : కేటీఆర్‌

Jan 26,2024 14:45 #KTR, #press meet

హైదరాబాద్‌: గవర్నర్‌ రాష్ట్ర ప్రజలకు బాధ్యులే గానీ.. సీఎం రేవంత్‌ రెడ్డికి కాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని బిఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. రిప్లబిక్‌ డే సందర్భంగా తెలంగాణ భవన్‌లో జాతీయ జెండాను ఆయన ఆవిష్కరించారు. రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్‌ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును ప్రజలంతా గమనిస్తున్నారని కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్‌, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన సత్యనారాయణను బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా నామినేట్‌ చేస్తే.. రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని అభ్యర్థిత్వాలను తిరస్కరించారని ఆక్షేపించారు. ఇప్పుడు ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న కోదండరామ్‌ పేరును ఎలా ఆమోదించారని ప్రశ్నించారు. ”నాడు కనిపించిన రాజకీయ నేపథ్యం ఇవాళ ఎందుకు కనిపించలేదు?. కాంగ్రెస్‌, బిజెపికు ఉన్న ఫెవికాల్‌ బంధంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారా?” అని ప్రశ్నించారు. సర్పంచుల పదవీకాలాన్ని పొడిగించాలని.. పర్సన్‌ ఇన్‌ఛార్జులను పెట్టద్దని కేటీఆర్‌ కోరారు. ‘ప్రజాపాలన’ అంటే ప్రజలతో ఎన్నికైన ప్రజాప్రతినిధులే చేయాలన్నారు. కరోనా సమయంలో రెండేళ్ల పాటు పరిపాలనా సమయం పోయిందని, పదవీకాలాన్ని ఆర్నెళ్లు లేదా ఎన్నికలు నిర్వహించే వరకు పొడిగించాలన్నారు.

మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకంలో కాంగ్రెస్‌, బిజెపి మధ్య ఉన్న రహస్య మైత్రి బయటపడిందన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్‌ ఆమోదించారని విమర్శించారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలన్నారు.

➡️