కుంభకోణాలకు నిలయంగా రైతు భరోసా కేంద్రాలు: నాదెండ్ల మనోహర్‌

Dec 22,2023 14:26 #Nadendla Manohar, #press meet

మంగళగిరి: రైతు భరోసా కేంద్రాలను వైసిపి ప్రభుత్వం కుంభకోణాలకు నిలయంగా మార్చిందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ ఆరోపించారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10 వేల రైతు భరోసా కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించిందన్నారు. వీటి నిర్మాణానికి జాతీయ ఉపాధి హామీ పథకం కింద కేంద్రం నుంచి రూ.2,300 కోట్లు నిధులు తీసుకొచ్చిందన్నారు. కానీ, గడిచిన ఐదేళ్లలో రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలకు కేవలం రూ.156 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని నాదెండ్ల తెలిపారు. చాలా కేంద్రాలను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారని అన్నారు. వీటికి గత ఏడాది నుంచి అద్దెలు కూడా చెల్లించకుండా భవన యజమానులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పారు. కేవలం దళారులకు లబ్ధి చేకూర్చేందుకు మాత్రమే వీటిని ఏర్పాటు చేశారని విమర్శలు గుప్పించారు. తుపానుల సమయంలో రైతులను ఆదుకోవాల్సిన భరోసా కేంద్రాలు చేతులెత్తేయడంతో ఇబ్బందులు పడుతున్నారని మనోహర్‌ చెప్పారు. ఈ కేంద్రాలలో రైతులకు ఎక్కువ ధరకు ఎరువులు, విత్తనాలు అమ్ముతున్నారని ఆయన ఆరోపించారు.

➡️