కెజి బేసిన్‌ గ్యాస్‌, చమురులో సగం శాతం వాటా రాష్ట్రానికివ్వాలి

ప్రజాశక్తి-గుంటూరు:కృష్ణా, గోదావరి బేసిన్‌లో లభ్యం అవుతున్న గ్యాస్‌, చమురు నిక్షేపాలలో సగం వాటా మన రాష్ట్రానికి ఇవ్వాలని కెజి బేసిన్‌ గ్యాస్‌, చమురు సాధన సమితి కన్వీనర్‌ డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌ కోరారు. గుంటూరులోని గీతా రీజెన్సీ హోటల్‌లో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలూ ఈ విషయాన్ని వాటి మ్యానిఫెస్టోలో పొందుపరిచి, సాధనకు కృషి చేయాలని కోరారు. ఏ ప్రాంతంలో లభ్యమయ్యే సహజ వనరులను ఉపయోగించుకునే హక్కు ఆ ప్రాంతానికి ఉంటుందన్నారు. సహజ వనరులు ఏ ప్రాంతంలో ఉంటే కనీసం సగం వాటా ఇవ్వడం సహజ న్యాయసూత్రమని పేర్కొన్నారు. సహజ వనరులు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికి 50 శాతం ఇవ్వాలని 12వ ఫైనాన్స్‌ కమిషన్‌ కూడా చెప్పిందన్నారు. కానీ మన అవసరాలు తీర్చకుండానే 1500 కిలోమీటర్ల దూరంలోని గుజరాత్‌, మహారాష్ట్రాలకు గ్యాస్‌, చమురు తరలిస్తున్నారని తెలిపారు. గత 20 సంవత్సరాలుగా గ్యాస్‌ను, ఈ ఏడాది జనవరి నుండి చమురు ఉత్పత్తి చేస్తున్నారన్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన మన రాష్ట్ర అభివృద్ధికి లక్షల కోట్ల విలువైన గ్యాస్‌, చమురు నిక్షేపాలు ఎంతో దోహదం చేస్తాయని తెలిపారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రతి ఒక్క పార్టీ, ప్రజలు ప్రశ్నించాలని కోరారు. సమావేశంలో సమితి నాయకులు మల్లికార్జునరావు, అవధానుల హరి, డాక్టర్‌ సేవాకుమార్‌, కొండా శివరామిరెడ్డి, జె రామారావు తదితరులు పాల్గొన్నారు.

➡️