కేఆర్‌ఎంబీకి నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించాం: నారాయణ రెడ్డి

Feb 1,2024 15:20 #krmb enc narayanareddy, #speech

హైదరాబాద్‌: కేఆర్‌ఎంబీకి నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించామని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలతో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. ”తెలంగాణలో ఆరు, ఏపీలో తొమ్మిది కంపోనెట్స్‌ అప్పగింతకు నిర్ణయం జరిగింది. నీటి వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం. సిబ్బంది కేటాయింపునకు రెండు రాష్ట్రాలు అంగీకరించాయి” అని ఏపీ ఈఎన్సీ వివరించారు.కృష్ణా జలాల్లో 50 శాతం వాటా డిమాండ్‌కు కట్టుబడి ఉన్నామని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్‌ స్పష్టం చేశారు. అనంతరం మురళీధర్‌ మీడియాతో మాట్లాడుతూ ”సమావేశంలో నీటి వాటాలపై మాత్రమే నిర్ణయాలు ఉంటాయి. ఏవైనా ఇబ్బందులు ఉంటే చర్చించడానికి ఢిల్లీ వేదిక ఉంది. నీటి నిర్వహణను అవుట్‌లెట్స్‌ బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ట్రాలు ఆమోదించాయి. జల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాల నిర్వహణపై చర్చ జరగలేదు. నీటి విడుదల అంశాన్ని త్రిసభ్య కమిటీకి అప్పగించాం” అని వెల్లడించారు.

➡️