కేసీఆర్‌ అసెంబ్లీకి రావాలి: సీఎం రేవంత్‌

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ తొమ్మిదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని, అందుకే ఆ పాలనను ప్రజలు తిరస్కరించారని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శుక్రవారం రేవంత్‌ అసెంబ్లీలో మాట్లాడారు. ‘బీఆర్‌ఎస్‌కు ప్రజలు ప్రధాన ప్రతిపక్ష బాధ్యత అప్పగించారు. అయినా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి రాకపోవడం దురదఅష్టకరం. ఆయన అసెంబ్లీకి వచ్చి మా ప్రభుత్వానికి మంచి సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 9వ తేదీ మా ప్రభుత్వం రెండు నెలలు పూర్తి చేసుకుంది. ఈ రెండు నెలల్లో మహిళలకు ఉచిత బస్సు, ఆరోగ్య శ్రీ పరిమితి పది లక్షలకు పెంపు హామీలు అమలు చేశాం. ప్రతిపక్షం సహకరించకపోయినా ప్రజాపాలన అందిస్తూ ముందుకెళ్తాం.గవర్నర్‌ ప్రసంగంలో ముఖ్యమైన విషయాలను పొందుపరిచాం. అయినా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మమ్మల్ని విమర్శిస్తూనే ఉన్నారు. వాళ్ల నాయకున్ని మెప్పించడానికి మాట్లాడుతున్నట్లు కనిపిస్తోంది. ప్రజలు తెలంగాణ ఉద్యమ కాలంలో టీజీ అని బండ్ల మీద రాసుకోవడంతో పాటు గుండెల మీద పచ్చబట్లు పొడిపించుకున్నారు. కానీ అప్పటి పాలకులు టీజీకి బదులు టీఆర్‌ఎస్‌ వచ్చేలా టీఎస్‌ అని పెట్టుకున్నారు. దానిని మార్చాం. రాజరిక పోకడలున్న అధికారిక చిహ్నం, తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చాలని నిర్ణయించాం’తెలంగాణ గీతాన్ని కేబినెట్‌ ఆమోదం తెలిపితే మెచ్చుకోకపోగా విమర్శలు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రైతు బంధు పైసలు 9 నెలల పాటు పడ్డాయి. ఉద్యోగులకు ఒకటవ తేదీన జీతాలు వేశాం. ఆటో కార్మికుల పక్షాన ఒకరు ఆటోలో డ్రామాలు వేశారు. గతంలో ఒకరు అగ్గిపెట్టె డ్రామాలు ఆడితే…మొన్న ఆటో డ్రామా మరొకరు వేశారు. వాళ్ళ ఇండ్లలో నాలుగైదు ఉద్యోగాలు ఉన్నాయి…కారుణ్య నియామకాలు మాత్రం చేపట్టలేదు’ అని రేవంత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌కు చురకలంటించారు.

➡️