గ్రూప్‌-1 అక్రమాల్లో జగనే ప్రధాన ముద్దాయి- టిడిపి అధినేత చంద్రబాబు

Mar 15,2024 23:10 #Chandrababu Naidu, #speech

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఎపిపిఎస్‌సి) నిర్వహించిన గ్రూప్‌-1 పోస్టుల అక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డే ప్రధాన ముద్దాయి అని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. ప్రతిష్టాత్మకమైన కమిషన్‌ను రాజకీయ పునరావాస కేంద్రం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎపిపిఎస్‌సి గ్రూప్‌-1 అక్రమాలపై ఉండవల్లిలోని తన నివాసంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో చంద్రబాబు ఏర్పాటుచేశారు. మొదటిసారి చేసిన మూల్యాంకనం వివరాలు దాచిపెట్టి రెండోసారి చేయాలని ప్రభుత్వానికి కమిషన్‌ ఛైర్మన్‌ సవాంగ్‌ ప్రతిపాదించారని చెప్పారు. ఇది కమిషన్‌ నిబంధనలకు విరుద్ధమన్నారు. అక్రమాలతో విద్యార్థుల కలలను ప్రభుత్వం నాశనం చేసిందన్నారు. కమిషన్‌ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌, మాజీ కార్యదర్శి పి సీతారామాంజనేయులుతోపాటు ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయరెడ్డిపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌లు జరుగుతున్నాయని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రజలు భయంగా బతకాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. పొత్తులు పెట్టుకున్న తరువాత పార్టీలో చిన్నచిన్న సమస్యలు వస్తాయని, వాటిని తాము పరిష్కరించుకుంటామని అన్నారు. తమ పార్టీలో కేసులకు గురై పోరాడిన వారిలో కొంతమందికి సీట్లు రాలేదన్నారు.

ముస్లిములకు ద్రోహం చేసింది జగనే..

ముస్లిములకు తీరని ద్రోహం చేసింది వైఎస్‌ జగన్‌ అని చంద్రబాబు విమర్శించారు. ముస్లిములకు జగన్‌ ఏమీ చేయలేక మళ్లీ మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. వారికి ఉన్న 4 శాతం రిజర్వేషన్లు కాపాడింది టిడిపినే అని తెలిపారు. పార్టీ నేతలతో శుక్రవారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. బిజెపితో పొత్తు ప్రకటన అనంతరం వైసిపి తప్పుడు ప్రచారానికి దిగుతోందని, దీనిని పూర్తిస్థాయిలో తిప్పి కొట్టాలని నేతలకు సూచించారు. చిలకలూరిపేట సభను చారిత్రాత్మకంగా నిర్వహించబోతున్నామని తెలిపారు. పొత్తు అవశ్యకతను ప్రజలకు తెలియజేయాలని పేర్కొన్నారు. ఎవరికి ఎన్ని సీట్లు అనేది ముఖ్యం కాదని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవడం అందరి బాధ్యత అని అన్నారు. పొత్తులో తమపై పవిత్రమైన బాధ్యత ఉందన్నారు. సీట్లు త్యాగం చేసిన వారికి ఎమ్మెల్సీలు, ఛైర్మన్లుగా అవకాశం కల్పిస్తామన్నారు.

➡️