ఘర్షణ తలెత్తడానికి పల్లవి ప్రశాంతే కారణం: డీసీపీ

Dec 22,2023 14:45 #Case, #pallavi prasanth

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ ఫైనల్స్‌ సమయంలో జరిగిన ఘర్షణల్లో టీఎస్‌ఆర్టీసీకి చెందిన 6 బస్సులు దెబ్బతిన్నాయని, పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని హైదరాబాద్‌ పశ్చిమ మండల డీసీపీ విజరుకుమర్‌ తెలిపారు. ఈ ఘటనలో పలువురు పోలీసులకు గాయాలైనట్లు ఆయన చెప్పారు. బిగ్‌బాస్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌ అరెస్టు, అంతకు ముందు జరిగిన పరిణామాలపై డీసీపీ విజరు మీడియాతో మాట్లాడారు. ప్రశాంత్‌ను విన్నర్‌గా ప్రకటించిన తర్వాత జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో వద్ద హంగామా జరిగిందన్నారు. ప్రశాంత్‌ను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ముందే చెప్పామన్నారు. కానీ, పోలీసుల మాట వినకుండా అతడు మళ్లీ వెనక్కి వచ్చారని తెలిపారు. ఎక్కువ మంది గుమిగూడి ఘర్షణ తలెత్తడానికి అతడే కారణమయ్యారని చెప్పారు. ఈ ఘటనలో రెండు కేసులు నమోదు చేశామని తెలిపారు. తొలి కేసులో ప్రశాంత్‌ సహా ముగ్గురిని అరెస్టు చేయగా.. మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. రెండో కేసులో ఇప్పటి వరకు 16 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీసీపీ విజరు పేర్కొన్నారు.

➡️