జగనన్నా… పండగ మీకా ? పస్తులు మాకా !

కె.కోటపాడు (వైజాగ్‌) : కె.కోటపాడు మండలంలో అంగన్వాడీల సమ్మె మంగళవారంతో 36 వ రోజుకు చేరుకుంది కనుమ ముగ్గులు వేసి జగనన్న పండగ మీకా! పస్తులు మాకా! అంటూ నోట్లో ఆకులు పెట్టుకొని మోకాళ్ళు పై నిలబడి అంగన్వాడీలు నిరసన తెలిపారు. తమ డిమాండ్లు పరిష్కారం చేయాలని నినదించారు. రాష్ట్రంలో ప్రతి అక్కాచెల్లెమ్మలకు న్యాయం చేస్తానని తెలంగాణా అంగన్వాడీ ఉద్యోగుల కంటే వెయ్యి రూపాయల వేతనం పెంచుతామని నమ్మించి మోసం చేశారని, పండుగ పూట పస్తు పెట్టారని ఆడ పడుచులను ఉసురు పెట్టారనీ జగనన్న ఇది న్యాయమేనా ? అంటూ అగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం ప్రాజెక్టు అధ్యక్షులు భవానీ, అధ్యక్షురాలు జి.కుమారి మాట్లాడారు.

ప్రభుత్వం చర్చలకు పిలిచి సలహదారులతో చర్చలు జరిపించి లక్షలాది మంది అంగన్వాడీలను హేళన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి ప్రతిఫలం అనుభవించక తప్పదని హెచ్చరించారు. సజ్జల రామకృష్ణా రెడ్డి అంగన్వాడీలపై దుష్ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. చర్చలకు పిలుస్తూ ఎస్మా చట్టాన్ని ప్రయోగించడం షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం చేస్తున్నారని మండిపడ్డారు. ఇది పూర్తిగా అప్రజాస్వామికమన్నారు. వెంటనే ఎస్మా జీవోను ఉపసంహరించుకోవాలని లేదంటే మరింతగా సమ్మె ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సాయిలక్ష్మీ, బి.లక్ష్మీ, నూకారత్నం, తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి వ్వవసాయకార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డి.వెంకన్న, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గండినాయన్‌ బాబు, యర్రాదేముడు మద్దతు ఇచ్చి మాట్లాడారు.

➡️