జగన్‌ పాలన మొత్తం దోపిడీల పర్వమే

Mar 21,2024 21:01 #Nara Bhuvaneshwari, #paryatana

– ‘నిజం గెలవాలి’లో నారా భువనేశ్వరి

ప్రజాశక్తి-పోరుమామిళ్ల :ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలన మొత్తం దోపిడీల పర్వంగానే కొనసాగిందని టిడిపి జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి విమర్శించారు. నిజం గెలవాలి యాత్రలో భాగంగా ఆమె గురువారం వైఎస్‌ఆర్‌ జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును తట్టుకోలేక బద్వేల్‌ నియోజకవర్గం పోరుమామిళ్లలో గుండెపోటుతో మృతి చెందిన కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అనంతరం భువనేశ్వరి మాట్లాడుతూ.. చంద్రబాబు పాలనలో అభివృద్ధి, సంక్షేమంలో ఎపిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెడితే, జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో కల్తీ మద్యం, ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, గంజాయి, డ్రగ్స్‌, మహిళలపై దాడుల్లో రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టారని విమర్శించారు. ఎపికి రాజధాని లేకుండా చేసి రాష్ట్రం పరువు తీశారన్నారు. వైసిపి చేసే అరాచకాలను ధైర్యంగా తిప్పికొట్టి, 2024 ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో అవినీతి పాలనను అంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ పాల్గొన్నారు.

➡️