తప్పుడు కథనాలపై ప్రజాశక్తి ఫిర్యాదు- విచారణకు ఆదేశించిన ఎడిజిపి

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ప్రజాశక్తి పేరుతో తప్పుడు కథనాలు తయారు చేసి సోషల్‌ మీడియా గ్రూపుల్లో ఫార్వార్డ్‌ చేయడంపై సంస్థ సిఐడికి ఫిర్యాదు చేసింది. వాటిపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని కోరింది. విశాఖలో భారీ ఎత్తున డ్రగ్స్‌ దొరికిన నేపథ్యంలో 22వ తేదీన ప్రజాశక్తి ప్రచురించినట్లు అమరావతి బ్యూరో పేరుతో ‘విశాఖ డ్రగ్‌ కేసులో చంద్రబాబు గ్యాంగ్‌’ ‘విశాఖ తీరంలో 25 వేల కేజీల కొకైన్‌తో పట్టుబడ్డ ముఠా’ అనే పేరుతో ఒక కథనాన్ని తయారు చేసి సోషల్‌ మీడియాలో ఫార్వార్డ్‌ చేస్తున్నారు. ప్రజాశక్తి పేరుతో చంద్రబాబు, పురంధేశ్వరిపై వ్యక్తిగతంగా దాడి చేశారు. ఆ పద్ధతుల్లో తప్పుడు కథనాలను ప్రజాశక్తి ఎప్పుడూ ప్రచురించదు. ఈ నేపథ్యంలో సంస్థ పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించే ఇటువంటి కథనాలు తయారు చేసి ఫార్వార్డ్‌ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఐడి అదనపు డిజికి ప్రజాశక్తి బ్యూరోచీఫ్‌ సురేష్‌ లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై విచారించి తగు చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఎడిజిపి అదేశాలు జారీచేశారు. ఇదే విషయమై ప్రజాశక్తి శ్రీకాకుళం జిల్లా ప్రతినిధి భీమారావు ఆ జిల్లా ఎస్‌పికి కూడా ఫిర్యాదు చేశారు. దర్యాప్తు జరుగుతోంది.

➡️