భావ వ్యక్తీకరణకు భాష దోహదం

Mar 9,2024 21:50 #speech, #Venkaiah Naidu

– సాహితీ సదస్సులో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు

ప్రజాశక్తి-కాకినాడ :భావ వ్యక్తీకరణకు భాష దోహదం చేస్తుందని భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. అలాంటి భాష తెలుగు సాహిత్యాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని దంటు కళాక్షేత్రంలో వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా 30వ వార్షికోత్సవం సందర్భంగా రచయితల సంఘం ఆధ్వర్యంలో రెండు రోజులపాటు జరిగే అఖిల భారత తెలుగు సాహితీ సదస్సును శనివారం వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కడ భాషా జ్ఞానం పెంపొందుతుంతో, ఎక్కడ తెలుగు భాషా పురోగమనం జరగుతుందో అక్కడ సాహిత్య సంపద పెరుగుతుందని అన్నారు. ఆంగ్ల భాషపై మోజుతో మాతృభాషను వదులుకోవడం సరైన నిర్ణయం కాదన్నారు. మాతృభాషకు ప్రాధాన్యతనిస్తూనే సోదర భాషలనూ నేర్చుకోవాలని సూచించారు. ప్రస్తుత ప్రభుత్వాలు భాషను ప్రోత్సహించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భాష వ్యాప్తికి దిన పత్రికలు, సినిమాలు దోహదం చేస్తాయని చెప్పారు. పద్మభూషణ్‌ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌, పద్మశ్రీ కొనకలూరి ఇనాక్‌, మండలి బుద్ధ ప్రసాద్‌, జన్నవిత్తుల, భువనచంద్ర తదితరులు తెలుగు భాష గొప్పతనం గురించి వివరించారు.

➡️