పర్యావరణ పరిరక్షణ వల్ల అందరికీ ఆరోగ్యం

Feb 9,2024 08:09 #jvv science, #kalajatha

– విశాఖలో సాగిన జెవివి సైన్స్‌ కళాయాత్ర

ప్రజాశక్తి -గాజువాక (విశాఖపట్నం): విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం కల్పించే నిమిత్తం జన విజ్ఞాన వేదిక (జెవివి) ఆధ్వర్యాన చేపట్టిన రాష్ట్రస్థాయి సైన్స్‌ కళాయాత్ర గురువారం విశాఖలో కొనసాగింది. ఈనెల నాలుగున శ్రీకాకుళంలో మొదలైన యాత్ర 18న అనంతపురంలో ముగియనుంది. విశాఖలోని మధురవాడ ప్రాంతంలోని చంద్రంపాలెం హైస్కూలు, పెందుర్తి, గాజువాకలోని జిల్లా పరిషత్‌ హైస్కూళ్లలో కళాయాత్ర సాగింది. గాజువాకలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా జెవివి రాష్ట్ర కార్యదర్శి మురళీధర్‌ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణ వల్ల అందరికీ ఆరోగ్యం కలుగుతుందన్నారు. ప్రజలకు మంచినీరు అందించేందుకు ప్రభుత్వం కృషిచేయాలని కోరారు. ప్రజలు మూఢనమ్మకాల బారిన పడకుండా కాపాడాలన్నారు. గాజువాక హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు కె.విజయప్రశాంతి మాట్లాడుతూ.. అందరూ శాస్త్ర ప్రచారంలో భాగస్వాములు కావాలన్నారు. అనంతరం మూఢనమ్మకాలు, సైన్స్‌ అభివృద్ధిపై చేస్తున్న కృషి పట్ల నాటికలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో జెవివి నాయకులు ఎస్‌వికె.పరశురాం, కె.జనార్దనరావు, అప్పారావు, డాక్టర్‌ ఎం.రమేష్‌కుమార్‌, శేషగిరిరావు, ఎస్‌వి.రమణ, పాలూరి లక్ష్మణస్వామి, ఎల్‌.కృష్ణారావు, ఎం.సమాచారం, కెవి.ప్రసాద్‌, కెవి.సత్యనారాయణ, వెంకటరావు, రంగనాథ్‌ పాల్గొన్నారు.

➡️