పేదలకు చదువు దూరం – విద్యార్థి ఉద్యమాలను ఉదృతం చేయాలి

Dec 28,2023 22:20 #SFI

– ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఆదర్శ ఎం.సాజి

ప్రజాశక్తి – అల్లూరి సీతారామరాజు నగర్‌ నుంచి ప్రత్యేక ప్రతినిధి :దేశంలో విద్య చాలా ఖరీదైందని, పేదలు చదువుకు ఆమడ దూరంలో ఉంటున్నారని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత సహాయ కార్యదర్శి ఆదర్శ్‌ ఎం.సాజి అన్నారు. విద్యార్థి వ్యతిరేక విధానాలపై పోరాటాలను మరింత ఉధృతం చేయాలని కోరారు. ఎస్‌ఎఫ్‌ఐ 24వ రాష్ట్ర మహాసభలో ఆయన మాట్లాడుతూ… మోడీ గద్దినెక్కిన తరువాత హిందూ, హిందూత్వ, హిందూస్తాన్‌గా మార్చాలని చూస్తున్నారని, ఇది భిన్నత్వంలో ఏకత్వానికి విరుద్ధమన్నారు. రాజ్యాంగంలోని ఇండియా, భారత్‌ అని పొందుపరిస్తే, మోడీ సర్కార్‌ ఇండియాను తొలగించి, భారత్‌ అని మాత్రమే పేర్కొంటుందన్నారు. ఎన్‌ఇపిలో ఉచిత, నిర్బంధ విద్యను తొలగించారని విమర్శించారు. విద్య వ్యవస్థను ఎన్‌ఇపి తిరోగమనం వైపు నడిపిస్తోందన్నారు. షైనింగ్‌ ఇండియా అని ప్రధాని అంటున్నారని కాని ప్రస్తుతం క్రైయింగ్‌ ఇండియాగా ఉందన్నారు. ప్రయివేటు విద్యాసంస్థల్లో పెంచిన ఫీజులకు వ్యతిరేకంగా ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాలను మరింత బలోపేతం చేయాలని కోరారు. మోడీ పాలనలో రెండు లక్షలకు పైగా ప్రభుత్వ పాఠశాలలు మూసివేశారన్నారు. డబ్బుంటే చదువు, లేకపోతే చదువు లేదన్న రీతిలో దేశంలో విద్యా వ్యవస్థ ఉందని విమర్శించారు. ప్రధాని మోడీ తెల్లారితే డిజిటల్‌ ఇండియా గురించి మాట్లాడుతున్నారని, అయితే దేశంలో 6,36,962 పాఠశాలల్లో ఒక్క కంప్యూటర్‌ కూడా లేదని తెలిపారు. స్వచ్ఛ భారత్‌ గురించి ప్రసంగాలిస్తారని, కానీ దేశంలో 78,854 పాఠశాలల్లో బాలికలకు బాత్రూమ్‌లు లేవని తెలిపారు. దేశంలో 1,99,870 పాఠశాలల్లో విద్యుత్‌ సరఫరా లేదన్నారు. మరోవైపు మధ్యాహ్నం భోజనం నిధుల్లో కోత విధిస్తున్నారన్నారు. దేశంలో 2016 నుంచి 2022 వరకు ప్రతి రోజూ 36 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. విద్యార్థులు లేరనే పేరుతో పాఠశాలల విలీనంతో స్టూడెంట్‌ కాంప్లెక్స్‌ తీసుకొస్తున్నారని, రిజర్వేషన్లను అంతం చేసేందుకు కుట్ర పన్నుతున్నారన్నారు. దేశ స్వాతంత్రోద్యమంలో ఎటువంటి పాత్ర లేని ఆర్‌ఎస్‌ఎస్‌ ఏదో గొప్ప సంస్థగా కలరింగ్‌ ఇస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజ మార్పు కోసం జరిగే పోరాటంలో 230 మందికి పైగా ఎస్‌ఎఫ్‌ఐ నేతలు తమ జీవితాలను త్యాగం చేశారని, ప్రజల కోసం పోరాటం మన బాధ్యతని సూచించారు.

➡️