ప్రజల్లోకి రాని సిఎం – ఎన్నికల ప్రచారానికి ఎలా వస్తారు?

Feb 7,2024 21:45 #Road Show, #ys sharmila

– ఇసుకపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదు

– బాపట్ల రోడ్‌షోలో షర్మిల

ప్రజాశక్తి-బాపట్ల :అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్లోకి రాని ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి ఎలా వస్తారని పిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడం చేతకాని చంద్రబాబు, ఒక్క వాగ్దానాన్నీ నిలబెట్టుకోలేని జగన్‌మోహన్‌రెడ్డిని ఈ సారి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ఇంటికి సాగనంపాలని ప్రజలను కోరారు. బాపట్ల అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద బుధవారం జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. బాపట్లలో ప్రజాప్రతినిధులు ఇసుక మాఫియాపై చూపుతున్న శ్రద్ధ అభివృద్ధిపై చూపడం లేదని విమర్శించారు. జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో పంట కాలువల అభివృద్ధి జరగలేదని, ఉన్న కాల్వ కట్టలను సైతం తవ్వేసి ఇసుక రూపంలో సొమ్ము చేసుకుంటున్నారని మండిపడ్డారు. బాపట్ల ప్రధాన కూడలిలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం ఏర్పాటును వైసిపి నాయకులే అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అధిక వర్షాలకు దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం చెల్లిస్తామన్న సిఎం హామీ నీరుగారిపోయిందన్నారు. మద్యపానాన్ని రూపుమాపుతానన్న జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేకంగా జగన్‌ బ్రాండ్‌ అమ్మకాలను మరింతగా పెంచేశారని విమర్శించారు. రాష్ట్రానికి రాజధాని లేదని, జీవనాడి పోలవరం పూర్తి కాలేదని, పరిశ్రమలు లేవని, 19 లక్షల మంది విద్యావంతులైన యువతకు ఉపాధి లేక నిరుద్యోగులుగా మిగిలారని పేర్కొన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ శాసనసభ్యులతో మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దామని చెప్పారని.. అధికారంలోకి వచ్చాక ఎంత మందితో రాజీనామాలు చేయించారని ప్రశ్నించారు. రూ.ఎనిమిది లక్షల కోట్ల అప్పులు రాష్ట్ర ప్రజల నెత్తిన రుద్దిన ముఖ్యమంత్రి… పాలనకు ఎంత మాత్రం అర్హుడు కాదన్నారు. టిడిపి, జనసేన పార్టీలు పొత్తుతో బిజెపికి తొత్తులుగా మారాయని, బి అంటే బాబు జె అంటే జగన్‌ పి అంటే పవన్‌ అని.. వెరసి బిజెపి అని అభివర్ణించారు. కేంద్రంలో రాహుల్‌ అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఫైల్‌పై తొలి సంతకం చేస్తారని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. తొలుత బాపట్ల పట్టణంలో చీలు రోడ్డు నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు షర్మిల రోడ్‌షో నిర్వహించారు.కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులు గంటా అంజిబాబు, కేంద్ర మాజీ మంత్రి జెడి శీలం, కనుమూరి బాపిరాజు, మస్తాన్‌ వలి, దోనేపూడి దేవరాజు, దండు రేణుక పలువురు కాంగ్రెస్‌ ప్రముఖులు పాల్గొన్నారు.

➡️