ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేదు : షర్మిల

Mar 10,2024 15:45 #speech, #ys sharmila

విజయవాడ: అధికార పార్టీ వైసిపి ‘సిద్ధం’ సభలతో ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటోందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల విమర్శించారు. ఒక్కో సిద్ధం సభకు రూ.90 కోట్లు ఖర్చు చేస్తోందని, మొత్తం ఈ సభల కోసం రూ.600 కోట్లు ఖర్చు పెట్టిందని ఆరోపించారు. ఇదంతా ఎవరి డబ్బు అని ప్రశ్నించారు. విజయవాడలోని ఆంధ్రరత్నా భవన్‌లో ఆమె మీడియాతో మాట్లాడారు.

”గత ఎన్నికల ప్రచారంలో జగన్‌ ఇచ్చిన మాట మరిచారు. 2.30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? ఏపీపీఎస్సీ ద్వారా ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశారు? మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ వేశారు. కావాల్సిన వాళ్లకే వాలంటీర్ల పేరిట ఉద్యోగాలు ఇచ్చారు. ఉద్యోగాలపై మేం నిలదీస్తే తీవ్రవాదుల్లా చూశారు. గఅహనిర్బంధాలు, అరెస్టులు చేశారు. ప్రతిపక్షాలకు కనీసం ప్రశ్నించే హక్కు లేకుండా చేశారు. కేంద్రంలో బిజెపి 10 ఏళ్లు అధికారంలో ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం 20 కోట్ల ఉద్యోగాలు రావాలి. కానీ, ఇవ్వలేదు”అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై షర్మిల మండిపడ్డారు. తాను ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై చర్చ జరిగిందని, అన్ని అంశాలను పరిశీలిస్తున్నామని చెప్పారు.

➡️