ప్రభుత్వాలను కూల్చే కసాయి బిజెపి

– సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ

– రాష్ట్రంలో 5 పార్లమెంటు, 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీ

– కాంగ్రెస్‌ పార్టీ విశాఖ ఉక్కు సభకు సిపిఐ మద్దతు

ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చే కసాయి బిజెపి అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ అన్నారు. విజయవాడ సిపిఐ రాష్ట్ర కార్యాలయం దాసరిభవన్లో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సిపిఐ 5 లోక్‌సభ, 15 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. ఒక్కో రాష్ట్రానికి బలాబలాలు వేర్వేరుగా ఉంటాయని, సామర్ధ్యాన్ని బట్టి పోటీ చేస్తామన్నారు. మరో వారం రోజుల్లో ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం, ఎవరు పోటీ చేస్తారు అనే స్పష్టత వస్తుందని వివరించారు. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, అనంతపురం, కర్నూలు లోక్‌సభలో పోటీచేసే ఆలోచన ఉందని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తరువాత దానికి వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలను, పార్టీలను అడ్డగోలుగా పడేస్తుందని విమర్శించారు. గోవా, మణిపూర్‌లో ప్రభుత్వాలను పడేసిందని, కర్ణాటకలో ప్రయత్నించిందన్నారు. ఆమ్‌ ఆద్మీ పార్టీ ఇంకా లంగని కారణంగా కేజ్రీవాల్‌పై కేసులు పెట్టిందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఎస్‌బిఐ తోసిపుచ్చటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే అన్నారు. బిజెపి చేసిన పనులు చెప్పుకుని ప్రజలను ఓట్లు అడగలేకపోతున్నదన్నారు. ఉత్తర భారతదేశంలో సీట్లు తగ్గుతాయని తెలిసి దక్షిణ భారతదేశంలో బిజెపి ప్రచారాన్ని ముమ్మరం చేసిందన్నారు. తమిళనాడు, కేరళలో మోడీ ఎక్కువ సార్లు పర్యటిస్తున్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి ఒంటరిగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. టిడిపిని నాశనం చేయడానికే బిజెపి పొత్తు పెట్టుకుందన్నారు. పొత్తు పెట్టుకుంటారా? జైలుకు వెళతారా? అని చంద్రబాబును భయపెట్టిందన్నారు. తెలుగు ప్రజలకు ద్రోహం చేసిన బిజెపిని, తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టిన టిడిపి, వైసిపిని కాకుండా ప్రత్యామ్నాయంగా ఉన్న ఇండియా ఫోరంను ప్రజలు ఆదరించాలని కోరారు. వామపక్షాలు, కాంగ్రెస్‌ వేదికతో ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. సిఎం జగన్‌ పర్యటన సందర్భంగా ఆయన రక్షణను సాకుగా చూపి చెట్లు నరికేయడమేమిటని ప్రశ్నించారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 15న కాంగ్రెస్‌ పార్టీ విశాఖలో నిర్వహించనున్న బహిరంగ సభకు సిపిఐ మద్దతిస్తున్నట్లు రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తెలిపారు.

➡️