బిఆర్‌ఎస్‌ ధరణిని రహస్య డాక్యుమెంట్‌గానే చూసింది :మంత్రి పొంగులేటి

హైదరాబాద్‌: ధరణి ద్వారా జరిగిన అక్రమాలన్నింటినీ ఆధారాలతో సహా బయటపెట్టి, శ్వేతపత్రం విడుదల చేస్తామని రాష్ట్ర రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత సర్కారు ధరణిని రహస్య డాక్యుమెంట్‌గా చూసిందని, తమ ప్రభుత్వం ఏదీ దాచి పెట్టదని స్పష్టం చేశారు. ధరణిలో ప్రజలకు ఇబ్బంది కలిగించే విషయాలను తొలగించి.. మంచి వాటిని కొనసాగిస్తామన్నారు. గురువారం మీడియా ప్రతినిధులతో మంత్రి ఇష్టాగోష్టిగా మాట్లాడారు.రిజిస్ట్రేషన్ల శాఖను కూడా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. విద్యుత్‌ సమస్య నుంచి బయటపడ్డామని, మంచి నీటి ఎద్దడి లేకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం ఫోన్‌ ట్యాపింగ్‌ చేసే ప్రసక్తే లేదన్నారు. మీడియా అకాడమీ ఛైర్మన్‌తో చర్చించి జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కచ్చితంగా తెలంగాణలో 14 స్థానాలు గెలుస్తుందని, ఇప్పుడున్న పరిస్థితుల్లో బిఆర్‌ఎస్‌కు ఒకటో, రెండో వస్తే గొప్ప అని వ్యాఖ్యానించారు.

➡️