బిజెపితో వైసిపి, టిడిపి కుమ్మక్కు-ఎపి పిసిసి అధ్యక్షులు వైఎస్‌.షర్మిల

Jan 24,2024 21:45 #speech, #ys sharmila

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :రాష్ట్రంలో కుమ్మక్కు రాజకీయాలు నడుస్తున్నాయని, బిజెపితో టిడిపి, వైసిపి కుమ్మక్కయ్యాయని ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షులు వైఎస్‌.షర్మిల ఆరోపించారు. విశాఖలోని దసపల్లా హోటల్లో కాంగ్రెస్‌ కార్యకర్తల విస్తృత సమావేశం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బిజెపితో చంద్రబాబు కనిపించే పొత్తులో ఉండగా, వైసిపి కనిపించని పొత్తు కొనసాగిస్తోందని విమర్శించారు. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు తీవ్రంగా ద్రోహం చేసిన బిజెపిని, దానితో కుమ్మక్కు అయిన పార్టీలను చిత్తుగా ఓడించాలని కోరారు. ప్రత్యేక హోదా కోసం జగనన్న ఒక్క రోజు కూడా ఉద్యమం చేసింది లేదన్నారు. ఉత్తరాంధ్రను వైసిపి, టిడిపి మోసం చేశాయని విమర్శించారు. గంగవరం పోర్టును అదానీకి అమ్మేశారని తెలిపారు. పోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న 10 శాతం వాటాను నిబంధనలకు విరుద్ధంగా రూ.600 కోట్లకు జగనన్న అమ్మేసి తీరని ద్రోహం చేశారని విమర్శించారు. 30 ఏళ్ల లీజు తర్వాత గంగవరం పోర్టు ప్రభుత్వ పరం కావాల్సి ఉందని, ఇప్పటికే లీజు కాలం 15 ఏళ్లు గడిచిందన్నారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఒక కుట్ర అన్నారు. ఇందిరమ్మ హయాంలో ఏర్పడిన విశాఖ స్టీల్‌ను అమ్మే ప్రయత్నం దుర్మార్గమని విమర్శించారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో 3 మిలియన్‌ టన్నుల ఉత్పత్తిని 7 మిలియన్‌ టన్నుల ఉత్పత్తికి పెంచారని తెలిపారు. ఇప్పుడు నష్టాల షాకుగా చూపి, ప్రయివేటీకరణ చేయాలని కేంద్రం చూస్తోందని విమర్శించారు. విశాఖకు రైల్వే జోన్‌ ఇచ్చినా ఇంకా అమలులోకి రాలేదని, మెట్రో రైల్‌ ప్రాజెక్టు పత్తా లేదని తెలిపారు. బిజెపితో టిడిపి, వైసిపి దోస్తీని కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కేంద్ర మాజీ మంత్రి జెడి.శీలం, పిసిసి మాజీ అధ్యక్షులు ఎన్‌.రఘువీరారెడ్డి, గిడుగు రుద్రరాజు, విశాఖ నగర కాంగ్రెస్‌ అధ్యక్షుడు గొంప గోవిందరాజులు తదితరులు పాల్గన్నారు.కాంగ్రెస్‌లో పలువురు చేరిక వైసిపి మాజీ నాయకుడు కొయ్య ప్రసాద్‌రెడ్డి, క్రికెటర్‌ కమలాకర్‌, మహిళా నేత బట్టా స్వర్ణ, మాజీ కార్పొరేటర్లు తాడి మనోహర్‌, అప్పలరాజు, టీవీ సీరియల్‌ నటి సరస్వతి, ఆప్‌ మాజీ నాయకుడు కాశీభట్ల బ్రహ్మస్వరూప్‌, బిఆర్‌ఎస్‌ నాయకుడు జెటి.రామారావు తదితరులు షర్మిల సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.

➡️