బిజెపి విధానాలు దేశానికి ప్రమాదకరం

– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు

ప్రజాశక్తి ా తణుకురూరల్‌కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అవలంభిస్తోన్న విధానాలు ప్రజానీకానికి, సమాజానికి ప్రమాదకరమని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు అన్నారు. రానున్న ఎన్నికల్లో బిజెపిని గద్దెదించాలని కోరారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని ఎన్‌జిఒ హోమ్‌లో సిఐటియు ఆధ్వర్యంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిజెపి పదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు చేయలేదని, ఉన్న ఏకైక భారీ పరిశ్రమ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను విదేశీ కంపెనీకి కట్టబెట్టాలని ప్రయత్నిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పడిపోయిందన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చాయని చెప్పుకోవడమే తప్ప స్థాపించిన దాఖలాలు లేవని విమర్శించారు. ఒకప్పుడు తణుకు ప్రఖ్యాతగాంచిన పారిశ్రామిక కేంద్రమని తెలిపారు. నాటి వైభవం నేడు మసకబారిందని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధి లేకుండా ఏ రాష్ట్రం కూడా ముందుకెళ్లదన్నారు. బిజెపి కార్మిక, రైతాంగ వ్యతిరేక ప్రభుత్వమని, కార్మికులకు లేబర్‌ కోడ్‌లను తీసుకొచ్చి స్వాతంత్రం ముందు నుంచి ఉన్న హక్కులను కాలరాస్తోందని తెలిపారు. లేబర్‌ వ్యవస్థ అంతా నిర్వీర్యమైపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. వ్యవసాయం మొత్తాన్ని కార్పొరేట్‌ చేయాలని ప్రయత్నిస్తోందన్నారు. కార్మిక, కర్షక ఐక్యతతో మోడీ విధానాలను తిప్పికొట్టాలని కోరారు. రాష్ట్రంలో బిజెపికి మద్దతు తెలుపుతున్న వైసిపి, టిడిపి, జనసేనను ఓడించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజా రామ్మోహన్‌రారు, జిల్లా కార్యదర్శి పివి.ప్రతాప్‌, నాయకులు నీలాపు ఆదినారాయణబాబు, గుబ్బల గోపి పాల్గొన్నారు.

➡️