బెదిరింపులకు భయపడం

Jan 5,2024 10:26 #Anganwadi strike, #statewide
  • సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె విరమించం – రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగిన అంగన్‌వాడీల సమ్మె

ప్రజాశక్తి-యంత్రాంగం : సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు, జారీ చేస్తున్న జిఓలకు భయపడేది లేదని అంగన్‌వాడీలు పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకుండా తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం దారుణమని మండిపడ్డారు. విధుల్లోకి చేరాలంటూ కలెక్టర్‌ జారీచేసిన మెమో కాపీలను రాష్ట్ర వ్యాప్తంగా దగ్ధం చేశారు. అంగన్‌వాడీల సమ్మె గురువారానికి 24వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలు పరిష్కరించేంత వరకు ఆందోళనలు విరమించబోమని స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వద్ద సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎవి.నాగేశ్వరరావు సందర్శించి మాట్లాడారు. అంగన్‌వాడీల శాంతియుత పోరాటాన్ని చేతగాని తనంగా చూడొద్దని హెచ్చరించారు. కాకినాడలో ఎమ్మెల్సీ ఐ.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే అంగన్‌వాడీల హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నెల్లూరులో సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు సందర్శించి మాట్లాడారు. కార్మిక వర్గంతో పెట్టుకున్న ప్రభుత్వాలు మనుగడ సాగించలేవని, కాలగర్భంలో కలిసిపోవాల్సిందేని హెచ్చరించారు. విశాఖలోని జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద అంగన్‌వాడీలు శవాసనం వేసి నిరసన తెలిపారు. అనకాపల్లి జిల్లా ఎస్‌.రాయవరంలో భిక్షాటన చేశారు. అల్లూరి జిల్లా డుంబ్రిగుడలో కబడ్డీ ఆడుతూ నిరసన చేపట్టారు. కర్నూలు జిల్లా తుగ్గలి, మద్దికెర మండల కేంద్రాల్లో అంగన్‌వాడీ కేంద్రాల వద్ద బాలామృతం ప్యాకెట్లను వాహనాల నుండి దించడాన్ని సిఐటియు నాయకులు, అంగన్‌వాడీలు అడ్డుకున్నారు. మద్దికెరలో ఐసిడిఎస్‌ అధికారులకు, అంగన్‌వాడీలకు మధ్య జరిగిన తోపులాటలో అంగన్‌వాడీ టీచర్‌ స్పృహ కోల్పోయారు.

వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించారు. గుంటూరు కలెక్టరేట్‌ ఎదుట సమ్మె శిబిరంలో ఆవుకు వినతిపత్రం ఇచ్చి నిరసన తెలిపారు. మంగళగిరిలో అంగన్‌వాడీల దీక్షలకు మద్దతుగా సిపిఎం సీనియర్‌ నాయకులు పి మధు ప్రసంగించారు. నోటీసుల పేరుతో ప్రభుత్వం చేసే తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని అన్నారు. పల్నాడు జిల్లాల్లో ఆందోళనలు కొనసాగాయి. ఎన్‌టిఆర్‌ జిల్లాలో సమ్మె శిబిరాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు తులసిరెడ్డి, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌ బాబూరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఎపి అంగన్‌వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్ప్‌ర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బేబిరాణి, కె సుబ్బరావమ్మ పాల్గొని మాట్లాడారు. కృష్ణాజిల్లా బంటుమిల్లిలో ఆర్‌టిసి బస్సులు తుడుస్తూ నిరసన కొనసాగించారు. బాపట్లలో సమ్మె శిబిరంలో పడుకొని నిరసన తెలిపారు. చిత్తూరు జిల్లా పుత్తూరులో సమ్మె విరమించాలని ఇచ్చిన నోటీసులను దగ్ధం చేశారు. చిత్తూరు జిల్లా కార్వేటినగరం ప్రాజెక్టు పరిధిలోని ఆరు మండలాల అంగన్‌వాడీలు చెరువులో దిగి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకులో మోకాళ్లపై నిల్చొని, పాలకొల్లు, భీమవరం, పోడూరులో ఒంటికాళ్లపై నిలబడి, పాలకోడేరులో క్రికెట్‌ ఆడి, గణపవరంలో దున్నపోతుకు వినతిపత్రం అందించి నిరసనలు చేపట్టారు. ఏలూరు కలెక్టరేట్‌ వద్ద, పెదపాడులో మోకాళ్లపై నిలబడి, కొయ్యలగూడెంలో పచ్చగడ్డి తింటూ నిరసన తెలిపారు. కుక్కునూరులో జగన్‌ ఫొటోతో భిక్షాటన చేశారు. విజయనగరం కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. గజపతినగరం, ఎస్‌.కోటలో 24 అంకె ఆకారంలో కూర్చొని, కొత్తవలసలో మెడకు ఉరితాళ్లు వేసుకొని నిరసన తెలిపారు.

పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడలో వాహనాలను శుభ్రం చేస్తూ, సీతంపేట, సీతానగరం, పార్వతీపురంలో మోకాళ్లపై నిల్చొని, సాలూరులో దండాలు పెడుతూ నిరసనలు కొనసాగించారు. శ్రీకాకుళంలో ఒంటి కాలిపై నిల్చొని నిరసన తెలిపారు. కోటబొమ్మాళి, కొత్తూరులో అధికారులు ఇచ్చిన మెమోల ప్రతులను దగ్ధం చేశారు. కడప, అన్నమయ్య, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, డాక్టర్‌ బిఆర్‌.అంబేద్కర్‌ కోననసీమ జిల్లాల్లో ఆందోళను కొనసాగాయి.

➡️