భూగర్భ జలశాఖ ఎడిపై హత్యాయత్నం

Jan 19,2024 08:22 #crime

– మారణాయుధాలతో గుర్తుతెలియని వ్యక్తుల దాడి

ప్రజాశక్తి-పుట్టపర్తి రూరల్‌ (శ్రీసత్యసాయి జిల్లా): శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భూగర్భ జలవనరుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌పై హత్యాయత్నం జరిగింది. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు మారణాయుధాలతో తల, ఛాతిపై దాడి చేసి గాయపర్చారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూగర్భ జలవనరుల శాఖలో ఎడిగా రాజశేఖర్‌రెడ్డి పని చేస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వ ఉద్యోగుల వికలాంగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత కారణాలతో కొన్ని రోజులుగా ఆయన సెలవుపై ఉన్నారు. భార్యతో విభేదాల నేపథ్యంలో పుట్టపర్తి సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి సమీపంలో అద్దె ఇంట్లో ఆయన ఒక్కరే నివాసం ఉంటున్నారు. బుధవారం మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆయన రాత్రి తిరిగొచ్చారు. ఇంట్లోకి వెళ్తుండగా అప్పటికే అక్కడ కాపు కాచిన గుర్తుతెలియని వ్యక్తులు రాజశేఖర్‌రెడ్డి కళ్లలో కారం చల్లి గొంతు, గుండె కింది భాగంలో పదునైన ఇనుప రాడ్డుతో పొడిచారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయారు. ఈ దాడిలో రాజశేఖర్‌రెడ్డి అక్కడే కుప్పకూలిపోయారు. అతికష్టం మీద సెల్‌ఫోన్‌ ద్వారా పోలీసులు, మిత్రులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రక్తపు మడుగులో ఉన్న రాజశేఖర్‌రెడ్డిని చికిత్స నిమిత్తం హిందూపురంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పుట్టపర్తి అర్బన్‌ సిఐ కొండారెడ్డి గురువారం ఘటనా స్థలాన్ని సందర్శించారు. రాజశేఖర్‌రెడ్డి నివాసం వద్ద ఉన్న సిసి కెమెరాలు పరిశీలించారు. త్వరలో నిందితులను అరెస్టు చేస్తామని తెలిపారు. వికలాంగుల సంఘం ఖండనరాజశేఖర్‌ రెడ్డిపై హత్యాయత్నంను జిల్లా వికలాంగుల సంఘం నాయకులు తీవ్రంగా ఖండించారు. వికలాంగుడని చూడకుండా కళ్లలో కారం చల్లి మారణాయుధాలతో దాడి చేయడం అత్యంత దుర్మార్గమని వికలాంగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు పిఎండి షఫీ, జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు తెలిపారు. నిందితులను తక్షణం అరెస్టు చేసి శిక్షించాలని కోరుతూ అదనపు ఎస్‌పి విష్ణుకు వినతిపత్రం అందజేశారు.

➡️