మత్స్య సంపద వృద్ధికి జాతీయ దృక్పథం అవసరం- కేంద్ర మంత్రి పర్షోత్తం రూపాల

Feb 15,2024 21:57 #Central Minister, #speech

ప్రజాశక్తి – గ్రేటర్‌ విశాఖ బ్యూరో :దేశంలోని వివిధ రాష్ట్రాల్లో మత్స్య సంపద వృద్ధికి జాతీయ దృక్పథం అవసరమని కేంద్ర మత్స్య, పశు సంవర్థక శాఖ మంత్రి పర్షోత్తం రూపాల అన్నారు. విశాఖలోని గ్రీన్‌ పార్క్‌ హోటల్‌లో నీతి ఆయోగ్‌, మత్స్యశాఖ సంయుక్త ఆధ్వర్యాన లోతట్టు రాష్ట్రాల మత్స్య సంపద వినియోగంపై గురువారం వర్క్‌షాప్‌ నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ మత్స్య సంపద, పాడి, పశుసంవర్థక పరిశ్రమ భారతదేశ పురోగతికి ఎంతగానో తోడ్పడతాయన్నారు. పశు, చేపల మేత కోసం ఎగుమతి, దిగుమతి విధానం, దేశంలో రిజర్వాయర్‌లు, నీటి వనరులను లీజుకు తీసుకునే విధానం, సంప్రదాయ మత్స్యకారుల వృత్తి రక్షణ, మార్కెట్ల అప్‌గ్రేడేషన్‌, నైపుణ్యం వంటి విషయాలపై తాజా వర్క్‌షాప్‌ రెండు రోజులపాటు జరుగుతుందని తెలిపారు. మత్స్యకారుల అభివృద్ధి, స్థిరమైన ఫిషింగ్‌ పద్ధతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కీలక వాటాదారులు, పరిశోధన సంస్థలన్నింటినీ ఒకేచోటకు చేర్చి సుస్థిర మార్కెట్‌ అనుసంధానంలో ఉండే సవాళ్లను అధిగమించేందుకు కార్యాచరణ రూపొందించనున్నామని చెప్పారు. దేశంలో సముద్ర చేపల పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లను వివరించారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్‌ సీనియర్‌ సలహాదారు డాక్టర్‌ నీలం పటేల్‌, ఎపి స్టేట్‌ ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీ కో వైస్‌ చైర్మన్‌ వి.రఘురాం, రాజ్యసభ సభ్యులు జివిఎల్‌.నరసింహారావు పాల్గన్నారు. 1589 మంది వికలాంగులకు ఉపకరణాల పంపిణీఎడిఐపి పథకం కింద విశాఖలోని కైలాసపురం డిఎల్‌బి గ్రౌండ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో సామాజిక అధికారిత శిబిర్‌ పేరుతో 1589 మంది వికలాంగులకు రూ.2.25 కోట్లతో 2,925 పరికరాలను అందజేశారు. అనంతరం గ్రాండ్‌ బే హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం ప్రయోజనాలను వివరించారు. రాష్ట్రీయ వయోశ్రీ యోజన పథకం ద్వారా వయోవృద్ధుల జీవితాల్లో సంతోషాలను నింపేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

➡️