మానసిక వికాసానికి బాలోత్సవాలు దోహదం- ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Dec 20,2023 09:22

ప్రజాశక్తి-విజయవాడ అర్బన్‌:చిన్నారుల మానసిక వికాసానికి బాలోత్సవం వంటి కార్యక్రమాలు దోహదం చేస్తాయని ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణరావు అన్నారు. పిల్లల ఆకాంక్షల అణచివేత వల్లే నేడు బాలోత్సవాలు విశేష ప్రాచుర్యం పొందాయని, ఒత్తిడి నుంచి బయటపడి మానసిక వికాసం పొందేందుకు ఇదే మార్గమని విద్యార్థులు భావిస్తున్నారని తెలిపారు. విజయవాడ మొగల్‌రాజపురంలోని సిద్ధార్థ ఆడిటోరియంలో మూడు రోజులపాటు జరగనున్న బాలోత్సవం 6వ పిల్లల పండుగ పద్మవిభూషణ్‌ ఎంఎస్‌.స్వామినాథన్‌ వేదిక (సిద్దార్థ ఆడిటోరియంలో)పై ఆనందోత్సాహాల మధ్య మంగళవారం ప్రారంభమైంది. తొలుత జాతీయ జెండాను లక్ష్మణరావు, బాలోత్సవం జెండాను బాలోత్సవం అధ్యక్షులు రామరాజు ఆవిష్కరించారు. అనంతరం రామరాజు అధ్యక్షతన జరిగిన ప్రారంభ సభలో లక్ష్మణరావు మాట్లాడారు. రాష్ట్రంలో 74 లక్షల మంది విద్యార్థుల్లో 36 లక్షల మంది కార్పొరేట్‌ స్కూళ్లలోనే చదువుతున్నారని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు విశాలమైన ఆట మైదానాలు ఉంటే కార్పొరేట్‌ స్కూళ్లను అపార్టుమెంట్లలో నిర్వహిస్తున్నారని వివరించారు. క్రీడా మైదానాల్లేక, ఆట, పాటల్లేక విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారన్నారు. ఒత్తిడితో సతమతమవుతున్న విద్యార్థులను బాలోత్సవాలు ఎంతగానో ఆకర్షిస్తున్నాయని తెలిపారు. ఆరేళ్ల కిందట విజయవాడలో ఏర్పడిన అమరావతి బాలోత్సవం ప్రతిసారీ వేలాది మంది పిల్లలను వికాసవంతులను చేసే కఅషి ముమ్మరంగా చేస్తోందన్నారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పట్టణాలకు బాలోత్సవాలు విస్తరించాయని తెలిపారు. 26 జిల్లాల్లో 40 చోట్ల బాలోత్సవాలు జరుగుతున్నాయని, వీటిని వంద చోట్లకు విస్తరించి నిర్వహించాలని నిర్వాహకులు ఆలోచిస్తుండడం మంచి విషయమన్నారు. ప్రజలు కూడా ముందుకొచ్చి వీటిని మరింత ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బిఐ డిజిఎం మనీష్‌ కుమార్‌, ఎన్‌టిఆర్‌ జిల్లా డివైఇఒ కెవిఎన్‌ కుమార్‌, అమరావతి బాలోత్సవం కార్యదర్శి పిన్నమనేని మురళీకఅష్ణ పాల్గన్నారు. తొలుత బాలోత్సవం కార్యదర్శి కొండలరావు వక్తలను వేదికపైకి ఆహ్వానించారు.

➡️