ముంచిన ‘మిచౌంగ్‌’

Dec 6,2023 09:47 #Tufan
  • బాపట్ల సమీపంలో తీరం దాటిన తుపాన్‌
  • ఏడు జిల్లాల్లో తీవ్ర నష్టం
  • 58 మండలాలపై తీవ్ర ప్రభావం
  • వేలాది ఎకరాల్లో పంటనష్టం
  • మరో 24 గంటలు వర్షాలు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : మిచౌంగ్‌ తీవ్ర తుపాన్‌ రాష్ట్రంపై విరుచుకుపడింది. మంగళవారం మధ్యాహ్నాం బాపట్ల సమీపంలో తీరం దాటింది. దాదాపు రెండు గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగింది. మధ్యాహ్నాం 12.30 గంటల నుండి 2.30 గంటల మధ్మ మిచౌంగ్‌ తీరం దాటినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. తుపాన్‌ తీరం దాటుతున్న సమయంలో గంటకు 90నుండి 100, 120 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచాయి. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున వర్షం కురిసింది. కోస్తా జిల్లాల్లో వర్ష తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. తీరం దాటినసమయంలో తీవ్ర తుపాన్‌గా ఉన్న మిచౌంగ్‌ సాయంత్రానికి తుపాన్‌గా మారింది. బుధవారం ఉదయానికి మరింత బలహీనపడి వాయుగుండంగా మారనుంది. దీని ప్రభావంతో మరో 24 గంటల పాటు కోస్తా జిల్లాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో తుపాన్‌ తీరం దాటినా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఏడు జిల్లాల్లోని 58 మండలాలపై మిచౌంగ్‌ తీవ్ర ప్రభావం చూపింది. పల్లపు ప్రాంతాలు జలమయంగా మారాయి. పలు చోట్ల రోడ్లకు, కాలువలకు తేడా తేలియని పరిస్థితి ఏర్పడింది. వేలాది ఎకరాలు నీట మునిగాయి. పశ్చిమగోదావరి, నెల్లూరు, గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్‌టిఆర్‌ జిల్లాల్లో తుపాన్‌ ప్రభావం తీవ్రంగా ఉంది. తిరుపతితో పాటు రాయలసీమలోని మరికొన్ని జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాలు, ఈదురుగాలుల ధాటికి వరి, పొగాకు, పసుపు, అరటి పంటలు దెబ్బతిన్నాయి. అనేక చోట్ల పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈదురుగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల విద్యుత్‌ స్థంబాలు, భారీ చెట్లు నెలకొరిగాయి. వీటిని తొలగించడానికి అధికారయంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. రాష్ట్ర వ్యాప్తంగా 211 పునరావాస కేంద్రాలకు 15173 మందిని తరలించారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. 18973 ఆహార ప్యాకెట్లు సరఫరా చేశారు. 80 చోట్ల వైద్య శిబిరాలు పెట్టారు. ముందు జాగ్రత్త చర్యగా నెల్లూరులో నాలుగు, బాపట్లలో మూడు, కృష్ణాలో రెండు, తిరుపతి, ప్రకాశంలో ఒక్కో బృందాలతోపాటు మొత్తం ఆరు ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఆరు ఎస్‌డిఆర్‌ఎఫ్‌ బృందాలను ఏర్పాటు చేశారు.

  • తిరుపతిలో అత్యధిక వర్షపాతం

సోమవారం ఉదయం 8.30 గంటల నుండి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకూ తిరుపతి జిల్లా కోటలో 38.8 సెంటీమీటర్లు, నెల్లూరు జిల్లా మనుబోలులో 36.6 సెంటీమీటర్లు, తిరుపతి జిల్లా చిల్లకూరులో 33.5, నాయుడుపేటలో 27.1, బలయపల్లిలో 23.9, నెల్లూరు జిల్లా సైదాపురంలో 22.3, వెంకటాచలంలో 21.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని వాతావరణశాఖ తెలిపింది. మంళవారం ఉదయం 8.30 గంటల నుండి సాయంత్రం ఆరుగంటల వరకు ఏలూరు జిల్లా తాడ్వాయిలో 14.8, బాపట్ల జిల్లా గురిజేపల్లిలో 14.5, అనకాపల్లి జిల్లా దార్లపూడిలో 13.6, కొత్తకోటలో 13, బలిగట్టంలో 12.6, బాపట్ల జిల్లా అప్పికట్లలో 12.5 సెంటమీటర్ల వర్షపాతం నమోదైంది.

➡️