ముగిసిన హార్బర్‌ ఫేజ్‌ మిలాన్‌ విన్యాసం

Feb 24,2024 08:26 #closed, #Indian Navy 'Milan'

ప్రజాశక్తి-ఎంవిపి.కాలనీ (విశాఖపట్నం): విశాఖపట్నంలో ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభమైన మిలాన్‌ 2024 సి ఫేజ్‌ విన్యాసం శుక్రవారం ముగిసింది. ఈ వ్యాయామంలో భాగంగా భాగస్వామ్య దేశాల ప్రతినిధులతో భద్రత, ద్వైపాక్షిక సంబంధాలకు సంబంధించి ఇంటర్నేషనల్‌ మారిటైం సెమినార్‌ నిర్వహించారు. ఈ సెమినార్‌లో యూనివర్సిటీ ఆఫ్‌ కోపెన్‌హాగన్‌ చెందిన ప్రతినిధి డాక్టర్‌ క్రిస్టియన్‌ బ్యూగర్‌, డిప్యూటీ కమాండర్‌ యునైటెడ్‌ స్టేట్స్‌ పసిఫిక్‌ ఫ్లీట్‌ -వైస్‌ అడ్మిరల్‌ బ్లేక్‌ కన్వర్స్‌, కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ ఆఫ్‌ జపాన్‌ మారిటైమ్‌ సెల్ఫ్‌-డిఫెన్స్‌ ఫ్లీట్‌ నుంచి వైస్‌ అడ్మిరల్‌ సైటో అకిరా, ఫ్రెంచ్‌ దళాల జాయింట్‌ కమాండర్‌ వైస్‌ అడ్మిరల్‌ ఇమ్మాన్యుయేల్‌ స్లార్స్‌ పాల్గని తమదేశాల నావికాదళ అభివృద్ధి కార్యక్రమాల అనుభవాలను, భవిష్యత్తు కార్యాచరణను పంచుకున్నారు. శుక్రవారం నాటి సెమినార్‌తో మిలాన్‌ హార్బర్‌ పేజ్‌ ముగిసింది. ఈ వ్యాయామంలో ప్రపంచ వ్యాప్తంగా 58 దేశాల నుంచి ప్రతినిధులు, నావికాదళ సిబ్బంది పాల్గన్నారు.నేటి నుండి మిలన్‌ 2024 సముద్ర దశ విన్యాసంశనివారం నుంచి ఈ నెల 27 వరకు సముద్ర దశ విన్యాసం జరగనుంది. ఇందులో భారత నౌకాదళ నౌకలు, జలాంతర్గాములు విమానాలు, విదేశాలకు చెందిన 15 నౌకలు ఒక విమానం పాల్గంటాయి. భారత విమాన వాహక నౌకలు ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య, ఐఎన్‌ఎస్‌ విక్రాంత్‌లు భారతదేశం తరపున పాల్గననున్నాయి. సీ ఫేజ్‌లో భాగంగా భాగస్వామ్య నావికాదళాలు సముద్ర యుద్ధంలో ఉపరితలం, ఉప-ఉపరితలం గాలి వంటి అన్ని డొమైన్‌లలో కసరత్తు చేస్తాయి. భాగస్వామ్య యూనిట్లు ఇంటర్‌ ఆపరేబిలిటీని ఏకీకృతం చేయడానికి, సముద్రంలో సంయుక్త టాస్క్‌ ఫోర్సుగా పనిచేయడానికి పరస్పర అవగాహనను పెంపొందించడానికి అధునాతన విన్యాసాలను చేపడతాయని అధికారులు తెలిపారు.

➡️