ముద్రగడతో మిథున్‌రెడ్డి భేటీ

Mar 7,2024 21:45 #join ycp, #Mudragada

– వైసిపిలోకి ఆహ్వానించిన ఎంపి

ప్రజాశక్తి – కిర్లంపూడి(కాకినాడ జిల్లా):మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభంతో వైసిపి ఉభయ ఉమ్మడి గోదావరి జిల్లాల రీజనల్‌ కో-ఆర్డినేటర్‌ మిథున్‌రెడ్డి గురువారం భేటీ అయ్యారు. కాకినాడ జిల్లా కిర్లంపూడిలోని ముద్రగడ ఇంటికి వెళ్లి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. వైసిపిలోకి రావాలని పద్మనాభంను కోరారు. అనంతరం మిథున్‌ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ.. ముద్రగడను వైసిపిలోకి ఆహ్వానించామని తెలిపారు. త్వరలోనే ఆయన మంచి నిర్ణయాన్ని ప్రకటిస్తారని భావిస్తున్నట్టు తెలిపారు. ముద్రగడ గుర్తింపు ఉన్న నాయకుడని, ఆఫర్ల కోసం పార్టీలో చేరే వ్యక్తి కాదని, స్వతహాగా ఆయనే పార్టీలో చేరుతారన్నారు. పెద్దలను గౌరవించడం ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి తెలుసని, ముద్రగడ పార్టీలోకి వస్తే సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. అయితే, ముద్రగడ తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించలేదు. ముద్రగడను కలిసిన వారిలో కాకినాడ ఎంపి వంగా గీత, కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మాజీ మంత్రి తోట నరసింహం తదితరులు ఉన్నారు.

➡️