మూతపడిన గ్రానైట్‌ పరిశ్రమల్లో విజిలెన్స్‌ దాడులు

Mar 12,2024 22:55 #ACB RIDS, #granite factories

ప్రజాశక్తి – మార్టూరు రూరల్‌ (బాపట్ల జిల్లా)మూతవేసిన గ్రానైట్‌ పరిశ్రమల్లో మైనింగ్‌ విజిలెన్స్‌ అధికారులు మంగళవారం దాడులు నిర్వహించారు. కృష్ణా జిల్లా మైనింగ్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఆర్‌.ప్రతాప్‌రెడ్డి, నెల్లూరు జిల్లా విజిలెన్స్‌ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ఎం బాలాజీనాయక్‌తో పాటు 14 మంది సిబ్బంది రెండు బృందాలుగా ఏర్పడి పోలీస్‌ బందోబస్తు నడుమ తనిఖీలు చేపట్టారు. బాపట్ల జిల్లా మార్టూరు సమీపంలోని జన్నతాళి వద్ద పలు గ్రానైట్‌ పరిశ్రమల్లో సోదాలు నిర్వహించారు. ముందుగా కామేపల్లి గ్రానైట్‌ పరిశ్రమ యజమాని అనుమతితో ఫ్యాక్టరీలో తనిఖీలు నిర్వహించారు. ఈ ఏడాది జనవరిలో మైనింగ్‌ అధికారులు ప్రయివేట్‌ వ్యక్తులతో తనిఖీలు నిర్వహించిన తీరు తీవ్ర వివాదాస్పదమైన విషయం తెలిసిందే. మార్టూరులోని బల్లికురవ, వేమవరం, మార్టూరు పరిసర ప్రాంతాల గ్రానైట్‌ పరిశ్రమలలో అవకతవకలు జరుగుతున్నాయనే సమాచారంతోనే ఈ తనిఖీలు చేపట్టినట్లు ప్రతాప్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు మైన్స్‌ అండ్‌ జియాలజీ రాష్ట్ర డైరెక్టర్‌ విజి వెంకటరెడ్డి నుంచి ఆదేశాలచ్చాయని తెలిపారు. పరిశ్రమలు మూసివేసినా.. సంబంధిత యజమానుల అంగీకారంతోనే తనిఖీలు చేస్తున్నామన్నారు. మార్టూరు గ్రానైట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు ఈ నెల 10 నుంచి దాదాపు 250 గ్రానైట్‌ పరిశ్రమలను యజమానులు మూసివేశారు. దీంతో జీవనోపాధి లేక కార్మికులు తమ సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారు. 

➡️