రజకులకు సామాజిక రక్షణ చట్టం చేయాలి – సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శ భాస్కరయ్య

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ :రాష్ట్ర వ్యాప్తంగా రజక వృత్తిదారులపై జరుగుతున్న సామాజిక దాడులు, దౌర్జన్యాలు, అక్రమ కేసుల నివారణకు రజకులకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య విజ్ఞప్తి చేశారు. కర్నూలు జిల్లా కేంద్రంలో నూతనంగా నిర్మించిన చిట్యాల ఐలమ్మ భవనంలో రజక వృత్తిదారుల సంఘం కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సి.గురుశేఖర్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో భాస్కరయ్య మాట్లాడారు. వీరనారి చిట్యాల ఐలమ్మ నిర్వహించిన పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో రజక వఅత్తిదారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారానికి కార్మిక, కర్షక భవన్‌లో ప్రారంభించిన కార్యాలయం దోహదపడుతుందన్నారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రజకులను ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు వినియోగించుకుంటూ, ఎన్నికల అనంతరం వారి సంక్షేమం, అభివఅద్ధి గురించి ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం విచారకరమని అన్నారు. రాజ్యాంగం ద్వారా సంక్రమించిన రిజర్వేషన్‌ ఫలితాలు రజకుల అభివృద్ధి- సంక్షేమానికి ఏ మాత్రమూ ఉపయోగపడలేదని తెలిపారు. దీనికి పాలకులు అనుసరిస్తున్న విధానాలే కారణమని అన్నారు. రాష్ట్రంలో నేటికీ రజక వృత్తిదారులపై అగ్రవర్ణ పెత్తందారులు దాడులకు పాల్పడుతున్నారని, అక్రమ కేసులు బనాయిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాటి నివారణకు సామాజిక రక్షణ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు డి.గౌస్‌ దేశారు, ఐలు జిల్లా కార్యదర్శి లక్ష్మన్న, కర్నూలు జిల్లా చేతి వృత్తిదారుల సమన్వయ కమిటీ నాయకులు జి.రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

➡️