రాష్ట్రంలో 1.03 మిలియన్‌ కిలోల పొగాకు అమ్మకాలు

-టుబాకో బోర్డు చైర్మన్‌ యశ్వంత్‌కుమార్‌

ప్రజాశక్తి-గుంటూరు :రాష్ట్రంలో ఈ ఏడాది 1.03 మిలియన్‌ కిలోల పొగాకు అమ్మకాలు జరిగాయని టుబాకో బోర్డు చైర్మన్‌ సిహెచ్‌ యశ్వంత్‌కుమార్‌ తెలిపారు. గుంటూరులోని టుబాకో బోర్డులో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎపిలో ఈ ఏడాది 142 మిలియన్‌ కిలోలు అనుమతి ఇవ్వగా, సుమారు 201 మిలియన్‌ కిలోలు పొగాకు సాగు అయినట్లు అంచనా వేశామని తెలిపారు. అందువల్ల ఈసారి కర్ణాటకలో వేలం ముగియక ముందే ఎపిలోనూ ఫిబ్రవరి 29న ప్రారంభించడంతో ఇప్పటి వరకూ 1.03 మిలియన్‌ కిలోలు అమ్మకాలు జరిగినట్లు చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలోని 16 వేలం కేంద్రాల్లోనూ కొనుగోలు జరుపుతున్నట్లు చెప్పారు. మిచౌంగ్‌ తుపాను ప్రభావంతో నష్టపోయిన పొగాకు రైతులు విషయమై కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పియూష్‌ గోయల్‌తో సమావేశమయ్యామని, ఈ ఏడాది కూడా అదనపు పంటపై విధించే పన్నును రద్దు చేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉన్నట్లు మంత్రి తెలిపారన్నారు. పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ పెనాల్టీ రద్దు చేసే అవకాశం ఉందన్నారు. బోర్డు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అద్దంకి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇంతవరకూ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పొగాకు బోర్డు ద్వారా విదేశీ మారకద్రవ్యం రూ. పది వేల కోట్లకు సమకూరిందన్నారు. గత సంవత్సరం రూ. తొమ్మిది వేల కోట్లుగా ఉందన్నారు. ప్రస్తుతం ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి రూ.11 వేల కోట్లకు చేరుతుందని ఆంచనా వేశామని తెలిపారు.

➡️