రాష్ట్ర పరిపాలన నచ్చలేదు’విదేశీ విద్య’కు పేరు మార్పుతో కలత

Feb 3,2024 21:37 #resignation, #Welfare Secretary

– సచివాలయ ఉద్యోగానికి వెల్ఫేర్‌ సెక్రటరీ రాజీనామా

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల జిల్లా):’జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎస్‌సి కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేశారు.. బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ను తీసివేసి పేదలకు నాణ్యమైన విద్యను దూరం చేశారు. అంబేద్కర్‌ విదేశీ విద్యా పథకానికి బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ను పేరును తొలగించి జగనన్న విదేశీ విద్యా దీవెనగా పేరు మార్చడం దుర్మార్గం. రాష్ట్ర పరిపాలన నాకు నచ్చలేదు’ అంటూ చీరాలలో సచివాలయ ఉద్యోగి తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను శనివారం చీరాల మున్సిపల్‌ కమిషనర్‌కు అందజేశారు.బాపట్ల జిల్లా చిన్నగంజాం మండలం చింతకుంపల్లె గ్రామానికి చెందిన కొణిదల విజరుకుమార్‌ చీరాల మున్సిపల్‌ పరిధిలోని 26వ వార్డులోని సచివాలయంలో వార్డు వెల్ఫేర్‌ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్నారు. ఎస్‌సిలను సిఎం జగన్‌మోహన్‌రెడ్డి చిన్నచూపు చుస్తున్నారని, ఆయన పాలన నచ్చడం లేదని, అందుకే రాజీనామా చేస్తున్నానని కమిషనర్‌ విజయసారథికి తన రాజీనామా పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో విజరుకుమార్‌ మాట్లాడుతూ.. మొదటి నుంచి దళితుల పట్ల వైసిపి ప్రభుత్వం వివక్ష చూపుతూనే ఉందని, దళితులను అర్థికంగా, రాజకీయంగా అణగదొక్కుతోందని విమర్శించారు. జగన్‌ ప్రభుత్వం అవలంభిస్తోన్న దుర్మార్గపు చర్యలను రాష్ట్ర వ్యాప్తంగా దళిత సంఘాలన్నింటినీ కలుపుకొని ఎండగడతామని చెప్పారు.

➡️